ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచే వివాదంతో మొదలైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ క్యాచ్ ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. బౌండరీ లైన్ వద్ద ఫిల్ సాల్ట్ పట్టిన ఆ క్యాచ్ నాటౌట్ అంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. స్టేడియం చుట్టూ 50 కెమెరాలు ఉన్నప్పటికీ థర్డ్ అంపైర్ రోప్ కెమెరాను ఎందుకు చూయించలేదంటూ ప్రశ్నిస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాంచి రైజింగ్‌లో ఉన్నప్పుడు అంపైర్ తీసుకున్న నిర్ణయం ఆ జట్టు కొంప ముంచింది. 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్ ఇషాన్ కిషన్ - హెన్రిచ్ క్లాసెన్ కలిసి ముందుకు తీసుకెళ్లారు. ఒక్కసారి ఇన్నింగ్స్ నిలబడటంతో సిక్సర్ల మోత మోగించారు. అప్పటి వరకు నిలకడగా ఆడిన క్లాసెన్ కూడా విరుచుకుపడ్డాడు. అదే సమయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం సన్‌రైజర్స్ భారీ స్కోర్‌కు బ్రేకులు వేసింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో రొమారియో షెఫర్డ్ వేసిన మొదటి బంతిని క్లాసెన్ భారీ షాట్ ఆడాడు. అయితే సరిగ్గా బౌండరీ దగ్గర ఫిల్ సాల్ట్ ఫ్లిప్ అవుతూ క్యాచ్ అందుకున్నాడు. రోప్‌కి దగ్గరగా క్యాచ్ పట్టడంతో ఫీల్డ్ అంపైర్ దాన్ని థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేశాడు. థర్డ్ అంపైర్ పరిశీలిస్తున్నప్పడు ఒక యాంగిల్‌లో సాల్ట్ షూ బౌండరీ కుషన్‌ను టచ్ అయినట్టు కనిపించింది. దాంతో అందరూ నాటౌట్ అనుకున్నారు. కానీ.. మళ్లీ రెండు మూడు సార్లు చూసిన థర్డ్ అంపైర్, కుషన్ కదిలిన యాంగిల్ వదిలేసి ఫ్లిప్ అయిన యాంగిల్‌లోనే చూడటం మొదలుపెట్టాడు. దాంతో రోప్‌కి సాల్ట్ టచ్ అవలేదంటూ చెప్పేసి అవుట్‌గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో కామెంటేటర్లతో పాటు క్లాసెన్‌ కూడా షాక్ అయ్యాడు. బౌండరీ లైన్ దగ్గర ఉన్న ఫోర్త్ అంపైర్‌తో కూడా క్లాసెన్ డిస్కషన్‌కి దిగాడు. కానీ పెవిలియన్‌కు వెళ్లక తప్పలేదు. అయితే, థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు గరంగరమవుతున్నారు. అక్కడ క్లియర్‌గా కుషన్‌ను టచ్ చేసినట్లు కనిపిస్తే ఎలా అవుట్ ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. 50 కెమెరాలు ఉన్నా బౌండరీ రోప్ యాంగిల్ చూడకుండా ఏదేదో చూస్తారేంటి అంటూ కామెంట్లు చేశారు. క్లాసెన్ - కిషన్ కలిసి 53 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 22 బంతులు ఆడిన క్లాసెన్ 31 పరుగులు చేయడం, ఆఖర్లో వరుస వికెట్లు పడటంతో ఎస్ఆర్‌హెచ్ 201/9కే పరిమితమైంది. ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే ఛేజ్ చేసి విజయం సాధించింది.