ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, రవాణా రంగాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రామాయపట్నం పోర్ట్ అభివృద్ధిలో భాగంగా రైల్వే అనుసంధానతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్ట్ నుండి తెట్టు రైల్వే స్టేషన్ మధ్య సుమారు 5.5 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం చెప్పారు. ఈ ప్రాజెక్టును 'పీఎం గతిశక్తి మల్టీమోడల్ కార్గో టెర్మినల్' కింద చేపట్టినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ప్రస్తుతం రామాయపట్నం పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ పనులను పర్యవేక్షిస్తోందన్నారు. విజయవాడ-గూడూరు ప్రధాన లైన్ పైన ఉన్న తెట్టు స్టేషన్ ద్వారా ఈ కనెక్టివిటీ రావడం వల్ల సరుకు రవాణా మరింత సులభతరం కానుందని చెప్పారు.మరోవైపు.. ఆంధ్రుల సెంటిమెంట్‌గా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక వివరణ ఇచ్చింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే ఉద్దేశం గానీ, దానిని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL)లో విలీనం చేసే ప్రతిపాదన గానీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్లాంట్‌లోని కొన్ని విభాగాల అవుట్‌సోర్సింగ్‌పై వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.పరిశ్రమలోని ఆస్తులన్నీ ప్రస్తుతం శాశ్వత ఉద్యోగుల పర్యవేక్షణలోనే ఉన్నాయని.. అయితే దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ల తరహాలోనే కొన్ని ప్రత్యేక కార్యకలాపాల కోసం ఏజెన్సీల సాయం తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. సింటర్ ప్లాంట్, థర్మల్ ప్లాంట్ వంటి విభాగాల్లో టెండర్లు జారీ చేయడం కేవలం నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికే తప్ప, అది దశల వారీ ప్రైవేటీకరణ కాదని ఆయన తేల్చి చెప్పారు. ఈ ప్రకటనతో స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై జరుగుతున్న ప్రచారానికి కేంద్రం చెక్ పెట్టినట్లయింది.