తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రంలో రానున్న ఆరు రోజులు వర్షాలు కురుస్తాయని అన్నారు. కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని చెప్పారు. దీని ప్రభావంతో ఏప్రిల్‌ 3 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ముఖ్యంగా నిర్మల్‌, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్‌, మహబూబాబాద్‌, సూర్యాపేట, నల్లగొండ, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్‌, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మలాజిగిరి, ములుగు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వారం రోజులుగా ఒకవైపు వర్షాలు కురుస్తుండగా, మరోవైపు ఎండలు కూడా దంచికొడుతున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా వాతావరణశాఖ పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే మూడ్రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. శనివారం (మార్చి 28) పది జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా మోస్రాలో 40.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. జగిత్యాల, సిద్దిపేట, నల్లగొండ, నిర్మల్ జిల్లాల్లో 40.4 డిగ్రీల సెల్సియస్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 40.2 డిగ్రీల సెల్సియస్, జోగులాంబ 40.1 డిగ్రీల సెల్సియస్, గద్వాల 40.1 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్‌ , జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. జాగ్రత్తలు తీసుకోండి.. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని అంటున్నారు. కేవలం దాహం వేసినప్పుడే కాకుండా, అప్పుడప్పుడు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకపోవడం మంచిదని అంటున్నారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే.. వదులైన కాటన్ దుస్తులు ధరించాలని.. ఎండ నుండి రక్షణ కోసం గొడుగు, టోపీ, సన్ గ్లాసెస్ వాడాలని చెబుతున్నారు. నూనెలో వేయించిన పదార్థాల కంటే, త్వరగా జీర్ణమయ్యే పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వాలని.. అలసట లేదా తల తిరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే నీడకు చేరుకుని విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు.