తెలంగాణలో కొత్త పెన్షన్లు.. అసెంబ్లీ వేదికగా మంత్రి కీలక ప్రకటన

Wait 5 sec.

తెలంగాణలో కొత్త చేయూత పెన్షన్ల కోసం లక్షల మంది అర్హులు ఆశగా ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ ప్రసంగం సమయంలో కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తామని కీలక ప్రకటన చేశారు. తాజాగా పెన్షన్లపై పంచాయతీరాజ్, మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క కూడా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేశామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 2 లక్షల పింఛన్లు ఇస్తామని వెల్లడించారు. కొత్తగా ఇవ్వబోయే పింఛన్లకు తాజా బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖల పద్దులపై శనివారం అసెంబ్లీలో చర్చ జరగ్గా.. మంత్రి సీతక్క సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు తొలగిస్తున్నట్లు ప్రతిపక్ష సభ్యులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తామెక్కడా ఫించన్లను తొలగించలేదని అన్నారు.. ఎవరైనా చనిపోయినా, రెండు పింఛన్లు పొందుతున్నా అలాంటివి పరిశీలించి అనర్హులుగా గుర్తించి ఆపేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వానికి పేదలపై ఎలాంటి విద్వేషం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద ఒక్కో పింఛనుకు రూ.200-300 మాత్రమే ఇస్తోందని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్లుగా కేంద్రం తన వాటాను పెంచడంలేదన్నారు. పల్లెలు పడకేశాయ్‌.. అభివృద్ధి కుంటుపడిందని బీఆర్ఎస్ విమర్శిస్తోందని.. మాజీ సర్పంచులకు ఇవ్వాల్సిన బిల్లుల్లో 99 శాతం వారి ప్రభుత్వ హయాంలోనివేనని విమర్శించారు. తాము రూ.318 కోట్లు క్లియర్‌ చేశామని గుర్తు చేశారు. మహిళలపై ఇంకా వివక్ష కొనసాగుతోందని.. అతివల గౌరవంపై పాఠ్యపుస్తకాల్లో ప్రత్యేక పాఠ్యాంశాన్ని పెట్టి అవగాహన కల్పించాలని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర పోలీసులు మహిళల భద్రత కోసం స్టాండ్‌ విత్‌ హర్‌ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. తాను నిత్య విద్యార్థిని అని ఎమ్మెల్యే అయ్యాక ఎంఏ, మంత్రి అయ్యాక ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేశానని చెప్పుకొచ్చారు. 60 ఏళ్లు దాటిన మహిళల కోసం ప్రత్యేక పొదుపు సంఘాలు ఏర్పాటుచేసే ఆలోచన ఉందని కూడా చెప్పారు. జల్‌జీవన్‌ పథకం కింద రూ.1620 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఇప్పటి వరకు చిల్లిగవ్వ ఇవ్వలేదని సీతక్క వెల్లడించారు. కల్యాణలక్ష్మి డబ్బులు రావడంలేదు కాగా, కొన్ని జంటలకు పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా కల్యాణలక్ష్మి డబ్బులు రావడంలేదని బీఆర్ఎస్ సభ్యురాలు సునీతా లక్ష్మారెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వానికి తెలియజేశారు. పంపిణీ చేసిన కొన్ని చెక్కులను ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రుల చేతుల మీదుగా ఇప్పిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని విమర్శించారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు.