శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుపై అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం. ఓ జర్నలిస్టును దుర్భాషలాడారంటూ గోవిందరావుపై ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే తీరును పాత్రికేయ సంఘాలు తప్పుబడుతున్నాయి. ఇదే సమయంలో ఈ వ్యవహారం కాస్తా తెలుగుదేశం పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. దీంతో ఎమ్మెల్యే గోవిందరావుపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలిసింది. ఎమ్మెల్యేగా హుందాగా నడుచుకోవాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. గోవిందరావుకు సూచించినట్లు సమాచారం. బాధ్యతలు తెలుసుకుని వ్యవహరించాలని.. జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పాలని ఆదేశించినట్లు సమాచారం. అలాగే ఘటనపై వివరణ ఇవ్వాలని గోవిందరావును టీడీపీ అధిష్టానం ఆదేశించినట్లు తెలిసింది. శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని పిండ్రువాడకు చెందిన శిమ్మయ్య అనే వ్యక్తి 2025 అక్టోబరు 10వ తేదీన పిడుగుపాటుతో చనిపోయారు. దీంతో ప్రభుత్వం శిమ్మయ్య కుటుంబానికి నాలుగు లక్షల రూపాయలు నష్ట పరిహారం మంజూరు చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేయగా.. వాటిని జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌లో ఉంచారు. దీనిపై సదరు విలేకరి వార్త రాయగా.. తనకు చెప్పకుండా వార్త ఎలా రాస్తారంటూ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు.. జర్నలిస్టుకు ఫోన్ చేసి దూషించినట్లు తెలిసింది. ఈ వ్యవహారం వెలుగులోకి రాగా.. జర్నలిస్టు సంఘాలు ఎమ్మెల్యేపై మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధిష్టానం కూడా వివరణ కోరింది. మరోవైపు మామిడి గోవిందరావు 2024 ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున గెలిచి తొలిసారిగా శాసనసభలోకి అడుగుపెట్టారు. వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతిపై సుమారు 26 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు గోవిందరావు. అయితే జర్నలిస్టును దూషించి వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేగా హుందాగా ఉండాలని.. బాధ్యతలు గుర్తెరిగి నడుచుకోవాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం మామిడి గోవిందరావుకు సూచించింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నడుచుకోవాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించినట్లు సమాచారం.