తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం.. ఇంటి యజమాని తెలివే కాపాడింది.!

Wait 5 sec.

తిరుపతిలో మరోసారి చెడ్డీ గ్యాంగ్ కదలికలు కలకలం రేపాయి. ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘునాథ రిసార్ట్స్‌‌ సమీపంలో ఓ ఇంట్లో చోరీకి యత్నించింది చెడ్డీ గ్యాంగ్. సునంద కుమార్ అనే వ్యక్తి ఇంట్లోకి శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ గ్యాంగ్ చొరబడింది. ముఖానికి మాస్కులు ధరించి, ఒంటిపై కేవలం నిక్కర్లతో గోడ దూకి లోపలికి వచ్చిన దొంగలను చూసి.. కుటుంబ సభ్యులు ఒక్కసారిగా హడలెత్తిపోయారు. ఇదే సమయంలో ఇంటి యజమాని, కుటుంబసభ్యులు సమయస్ఫూర్తితో గట్టిగా కేకలు వేశారు. దీంతో స్థానికులు అప్రమత్తమవుతారని భయపడిన చెడ్డీ గ్యాంగ్ ముఠా అక్కడి నుండి పలాయనం చిత్తగించింది. ఈ దృశ్యాలన్నీ స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల 20 నిమిషాల సమయంలో.. ముగ్గురు దొంగలు ఇంటి ఆవరణలోకి రాగా.. ఒక్కరు మాత్రమే ఇంటి లోపలికి ప్రవేశించినట్లు తెలిసింది. సుమారు అరగంట పాటు దొంగలు ఇంటి ఆవరణలో తచ్చాడారు. దొంగల ముఠాలో ఒక్కరు మాత్రమే మూడు గంటల సమయంలో ఇంటిలోనికి చొరబడగా.. కుటుంబసభ్యులు గమనించి కేకలు వేశారు, దీంతో అతనితో పాటు ఇంటి బయట ఉన్న ఇద్దరు కూడా అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిసింది. మరోవైపు ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో ఎంఆర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు .. క్లూస్ టీమ్ సాయంతో వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. చెడ్డీ గ్యాంగ్ ఇంటిలో ఎలాంటి చోరీ చేయలేదని గుర్తించారు. చెడ్డీ గ్యాంగ్ కదలికలను గుర్తించిన నేపథ్యంలో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎవరినైనా అనుమానాస్పదంగా గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో ఉన్నారు. అయితే తిరుపతిలో గతంలోనూ చెడ్డీ గ్యాంగ్ కదలికలను గుర్తించారు. తాజాగా మరోసారి వీరి కదలికలను గుర్తించటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీని పెంచాలని కోరుతున్నారు.