అంగన్వాడీ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్.. "తొలి ముద్ద" పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Wait 5 sec.

తెలంగాణ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని చిన్నారుల కోసం తొలి ముద్ద పథకాన్ని ప్రారంభించింది. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ అందించే క్రమంలో భాగంగా తొలి ముద్ద పేరుతో కొత్త పథకాన్ని శనివారం ప్రారంభించారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమైంది. తొలి ముద్ద పథకంలో భాగంగా రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు ఇక నుంచి ఉప్మా, కిచిడీ మిక్స్ బ్రేక్‌ఫాస్ట్‌గా అందించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. దేశానికి తొలి ప్రధానమంత్రిగా వ్యవహరించిన జవహర్ లాల్ నెహ్రూ విద్యారంగం, నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. మన దేశంలో ప్రస్తుతం ఆహార భద్రత ఉందని.. అయితే పోషకాలతో కూడిన న్యూట్రిషన్ ఫుడ్ మాత్రం అందడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టిక ఆహారం అందిస్తోందని వివరించారు. ఆరేళ్లలోపు చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందిస్తేనే వారిలో ఎదుగుదల సక్రమంగా ఉంటుందని.. సరైన ఆహారం అందకపోవటం వల్లనే సమస్యలు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. అలాంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం ఇలాంటి పథకాలను అమలు చేస్తోందని వివరించారు. ఈ క్రమంలోనే బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభించామన్న రేవంత్ రెడ్డి.. అయితే ప్రభుత్వం ఏ ప్రణాళికలు రచించినా.. అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం అంగన్‌వాడీ టీచర్లదేనని స్పష్టం చేశారు. తొలి ముద్ద పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులను కన్నబిడ్డలుగా చూసుకోవాలని.. వారికి పౌష్టికాహారం అందించాలన్నారు. అంగన్వాడీలకు సెల్ ఫోన్లు పంపిణీ..మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అంగన్‌వాడీ కేంద్రాలు సొంత భవనాల్లోనే ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ సిబ్బందిని తెలంగాణ ప్రభుత్వం కుటుంబసభ్యుల్లా భావిస్తోందన్న సీఎం రేవంత్ రెడ్డి.. అంగన్వాడీల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.