ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సుమారు ఐదున్నర గంటల సుదీర్ఘ చర్చ అనంతరం చట్టబద్ధత తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. అనంతరం అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అయితే అమరావతి చట్టబద్ధత తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన పవన్ కళ్యాణ్.. ఇలాగైతే రాష్ట్రాన్ని కాపాడలేమని అభిప్రాయపడ్డారు. "1953 నుంచి ఇప్పటి వరకూ ఒకరేమో అటు పొమ్మన్నారు. మరొకరు ఇటు పొమ్మన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిన ఆంధ్రలో మాత్రం మనం ఇంకా కొట్టుమిట్టాడుతున్నాం. కేంద్రం వద్ద దేహీ అని అడగాల్సి వస్తోంది. ఆఫీసులు, షెడ్యూల్ ప్రకారం రావాల్సిన ఆస్తులు ఇంకా రాలేదు. ఇవన్నీ అడగాలంటే మన గొంతు చాలా బలంగా ఉండాలి. సబ్ డివిజన్స్ అనే ధోరణిని మనం వదిలేయాలి. మీరు ఉత్తరాంధ్ర, మీరు రాయలసీమ, మీరు గోదావరి జిల్లాలు.. ఇవన్నీ ఆంధ్రా కాదా? అందరూ మాట్లాడేది తెలుగు కాదా? ఇందాక లోకేష్ మాట్లాడుతూ.. మీ ఉత్తరాంధ్రకు అవసరం లేదా అన్నారు.. ఇంకా మనలో మనం సబ్ డివిజన్స్ పెట్టుకుంటే.. ఈ రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేరు. అందరూ చదువుకున్నవాళ్లు, అనుభవం ఉన్నవాళ్లు.. మీరంతా కూడా ఒకటే నేల, ఒకటే రాష్ట్రం, ఒకటే భాష.. ఒకటే జాతి అని చెప్పకపోతే.. మన బలహీనత వాళ్ల గెలుపు అవుతుంది.. " అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు చర్చ సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో కాంగ్రెస్‌ బాధ్యతగా వ్యవహరించలేదని విమర్శించారు. రాష్ట్రం ఏర్పాటైన నాటికి కార్యాలయాలు లేవని.. టెంట్‌ వేసుకొనైనా పని చేద్దామని చంద్రబాబు ఆశించారన్నారు. రాష్ట్రం ఏర్పాటై ఇన్నేళ్లు గడుస్తున్నప్పటికీ.. ఇంకా రాజధాని కోసం కొట్టుకునే పరిస్థితి ఉందన్నారు. ఏపీకి ఇప్పటికీ రాజధాని, సరైన హైకోర్టు లేదంటే బాధేస్తోందన్న పవన్ కళ్యాణ్.. అభివృద్ధికి రాజకీయ స్థిరత్వం అవసరమని అన్నారు. తెలంగాణ , ఆంధ్రా వేర్వేరు అనే భావన తనకు లేదన్న పవన్ కళ్యాణ్.. తెలుగునేల అనే భావన ఉండేదన్నారు. ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న గౌరవంతోనే 2014లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. ఇక ఏపీ రాజధాని అమరావతిపై జనసేన ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దీనికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.