గిగ్ వర్కర్లకు వెల్ఫేర్ బోర్డు, యూనిక్ ఐడీ.. పెన్షన్, ఇన్సూరెన్స్, మెటర్నిటీ బెనిఫిట్స్‌.. కొత్త బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

Wait 5 sec.

తెలంగాణలో గిగ్ వర్కర్లను ఆదుకుంటామని.. వారి సంక్షేమానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఇప్పటికే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఒక కొత్త చట్టాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి.. సరికొత్త బిల్లును తీసుకువచ్చారు. రాష్ట్రంలోని గిగ్ వర్కర్ల హక్కులు, భద్రత కోసం సర్కార్ కీలక చర్యలు చేపట్టింది. తెలంగాణ ప్లాట్ ఫాం ఆధారిత గిగ్ వర్కర్ల నమోదు, సామాజిక భద్రత, సంక్షేమ బిల్లు 2026ను మంత్రి గడ్డం వివేక్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గిగ్ పర్కర్లకు చట్టబద్ద గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకొచ్చినట్లు మంత్రి వివేక్ స్పష్టం చేశారు. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదముద్రవేసిందిగిగ్ వర్కర్ల హక్కులు.. గౌరవం.. జీవనోపాధిని కాపాడే విధంగా ఈ తెలంగాణ ప్లాట్ ఫాం ఆధారిత గిగ్ వర్కర్ల నమోదు, సామాజిక భద్రత, సంక్షేమ బిల్లు 2026లో నిబంధనలు రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ బిల్లులో భాగంగా ప్లాట్‌ఫామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ వివరాలను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 3 నెలలకు ఒకసారి ఎలక్ట్రానిక్ రిటర్న్స్ ప్రభుత్వానికి సమర్పించాలని తెలిపారు. నిబంధనలు పాటించని ప్లాట్‌ఫామ్ సంస్థలపై భారీగా ఫైన్లు విధించేలా ఈ బిల్లులో కఠిన నిబంధనలు తీసుకువచ్చారు. మొదటిసారి నిబంధనలు పాటించకపోతే రూ.50 వేల జరిమానా.. అదే రెండోసారి రిపీట్ అయితే రూ.1 లక్ష.. మూడోసారి కూడా రూల్స్ పాటించకపోతే రూ.1.5 లక్షలు ఫైన్ వేయనున్నారు. ఆ తర్వాత బకాయిలపై 5 రెట్ల వరకు ఫైన్లు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ గిగ్ వర్కర్‌ యూనిక్ ఐడీని కేటాయించనున్నారు. 1 లేదా 2 శాతం లెవీతో గిగ్ వర్కర్లకు వెల్ఫేర్ ఫండ్‌ను సిద్ధం చేయనున్నారు. అంతేకాకుండా గిగ్ వర్కర్లకు ఇన్సూరెన్స్, పెన్షన్, ప్రసూతి ప్రయోజనాలను కూడా కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతీ ట్రాన్సాక్షన్‌పై ఫీజు వసూలు చేసి.. ఈ వెల్ఫేర్ బోర్డు నిర్వహణ ఖర్చులకు గరిష్టంగా 5 శాతం ఉపయోగించనున్నారు. అదే సమయంలో పారదర్శక విధానాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గిగ్ వర్కర్లకు వేతనాలు, కోతల వివరాలు స్పష్టంగా తెలియజేయాలని సంబంధిత ప్లాట్‌ఫామ్ సంస్థలకు ఆదేశించడం.. యాప్ అల్గోరిథమ్‌లో వివక్ష లేకుండా చూడడం వంటి అంశాలను ఈ బిల్లులో చేర్చారు.గిగ్ వర్కర్లకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక బిల్లును తీసుకువచ్చిందని వెల్లడించారు. గిగ్ వర్కర్ల యూనియన్ నేతలతో ముఖ్యమంత్రి చర్చించి సమస్యలు తెలుసుకున్నారని చెప్పారు. ఈ బిల్లుకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును సిద్ధం చేసి.. 30 రోజులు ప్రజలకు అందుబాటులో ఉండేలా పబ్లిక్ డొమైన్‌లో పెట్టినట్లు తెలిపారు. వాటిపై 65 సలహాలు వచ్చాయని.. వాటిని డ్రాఫ్ట్‌ బిల్లులో కమిటీ పొందుపరిచినట్లు మంత్రి వివరించారు. తాను కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. 5 సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. గిగ్ వర్కర్ల యూనియన్లకు ఉన్న సందేహాలను నివృత్తి చేశామని.. 20 మందితో గిగ్ వర్కర్ల వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వివేక్ స్పష్టం చేశారు. ఈ కమిటీలో గిగ్ వర్కర్స్ అగ్రిగేటర్స్ ఉంటారని తెలిపారు. ప్రతీ సంవత్సరం ఈ గిగ్ వర్కర్ల వెల్ఫేర్ బోర్డు సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గిగ్ వర్కర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక్కొక్కరికీ యూనిక్ ఐడీ వస్తుందని మంత్రి తెలిపారు. స్విగ్గీ, జొమాటో సహా అన్ని ప్లాట్‌ఫాం కంపెనీలకు ఒకటే ఐడీ ఉంటుందని మంత్రి వెల్లడించారు. గిగ్ వర్కర్లు తాము ఎదుర్కొంటున్న సమస్యలను.. కమిటీకి చెప్పుకోవచ్చని తెలిపారు. గిగ్ వర్కర్ల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేక అధికారులతో పాటు ప్లాట్‌ఫామ్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. గిగ్ వర్కర్లకు భద్రత, హక్కులు కల్పించే దిశగా ఈ బిల్లు కీలకమని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది.ఇక గిగ్‌ వర్కర్ల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని.. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఆయా కంపెనీలతో మాట్లాడి గిగ్ వర్కర్లకు హెల్త్ ఇన్సూరెన్స్, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలను అందించడంతోపాటు.. ఉద్యోగ భద్రత కల్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు గిగ్‌ వర్కర్లతో భేటీ అయిన కేటీఆర్.. వారి సమస్యలు విని భరోసా ఇచ్చారు. 2023 ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే గిగ్‌ వరర్ల సంక్షేమం కోసం ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు, గిగ్‌ వరర్ల ప్రతినిధులతో కలిపి ఒక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.