ప్రసవ మరణాలకు బ్రేక్.. మాతాశిశు సంరక్షణలో జాతీయ సగటును మించిన తెలంగాణ

Wait 5 sec.

తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగం బలోపేతానికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఉన్న ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేయటంతో పాటు కొత్తగా ఆసుపత్రులను నిర్మిస్తోంది. ఇక అందించేందుకు కృషి చేస్తోంది. దీంతో ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు పేదలకు అందుతున్నాయి. ముఖ్యంగా మాతాశిశు సంరక్షణలో జాతీయ సగటును మించిన అద్భుత ఫలితాలను సాధిస్తోంది. ఇటీవల విడుదలైన 'తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2026' నివేదిక ప్రకారం.. ప్రసవ మరణాల నియంత్రణ, శిశు మరణాల తగ్గింపు, సంస్థాగత ప్రసవాల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. మాతాశిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన ఈ విజయానికి ప్రధాన కారణమని నివేదిక వెల్లడించింది.రాష్ట్రంలో మాతృ మరణాల నిష్పత్తి గణనీయంగా తగ్గింది. దేశవ్యాప్తంగా ప్రతి లక్ష జననాలకు 88 మాతృ మరణాలు సంభవిస్తుండగా.. తెలంగాణలో ఇది కేవలం 43 మాత్రమే ఉండటం గమనార్హం. అదేవిధంగా.. శిశు మరణాల రేటు జాతీయ సగటు 25తో పోలిస్తే రాష్ట్రంలో 18కి పడిపోయింది. ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు జాతీయంగా 29 ఉండగా.. మన రాష్ట్రంలో 22గా నమోదైంది. అలాగే నవజాత శిశు మరణాల రేటు దేశంలో 19 ఉంటే తెలంగాణలో 14కు తగ్గింది. తెలంగాణలో ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలు దాదాపు వంద శాతం (99.9%)కి చేరుకోవడం ఒక మైలురాయి. జాతీయ సగటు 88.6%తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. గర్భిణిలకు ముందస్తు రిజిస్ట్రేషన్, క్రమం తప్పకుండా నిర్వహించే వైద్య పరీక్షలు ఈ మార్పుకు దోహదపడ్డాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని 95 శాతం గర్భధారణలను మొదటి మూడు నెలల్లోనే రిజిస్టర్ చేయడం, కనీసం 90 శాతం మంది గర్భిణిలకు నాలుగు కంటే ఎక్కువ సార్లు వైద్య పరీక్షలు నిర్వహించడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన 'ఆరోగ్య మహిళ' కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 372 కేంద్రాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్, సూక్ష్మపోషకాల లోపం, ఇతర ఆరోగ్య సమస్యలపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 28.3 లక్షల మంది మహిళలకు ఈ పథకం కింద స్క్రీనింగ్ నిర్వహించినట్లు నివేదిక వెల్లడించింది. రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు గర్భిణీలకు ప్రత్యేక పోషకాహార కిట్‌లు, నిరంతర పర్యవేక్షణ అందిస్తున్నారు.అధిక రిస్క్ ఉన్న గర్భధారణలను గుర్తించడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇందుకోసం 69 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 234 టిఫా స్కాన్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2025 మధ్య కాలంలోనే దాదాపు 60 వేల మంది గర్భిణీలు ఈ ఉచిత స్కానింగ్ సేవలను వినియోగించుకున్నారు. దీనివల్ల గర్భస్థ శిశువుల్లో వచ్చే లోపాలను ముందే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం సాధ్యమవుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు, గర్భిణీలు మరియు ప్రసవానంతర తల్లుల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.