మార్కాపురం బస్సు ప్రమాదం.. రిపేర్ చేసిన కొంత సేపటికే ఘోరం, 13 మంది సజీవ దహనం

Wait 5 sec.

తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా వణికించింది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా నుంచి 35 మందితో వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ఆ ప్రైవేటు బస్సు.. రాయవరం సమీపంలోకి రాగానే పలకల క్వారీ వద్ద టిప్పర్‌ను ఢీకొట్టడంతో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 13 మంది సజీవ దహనం అయ్యారు. మరో 22 మందికి తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఈ బస్సు ప్రమాదం.. బాధిత కుటుంబాలకు అంతులేని విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఇప్పటి దాకా 13 మంది మృతదేహాలను బయటికి తీశారు. ఇక ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బస్సు కండీషన్‌ సరిగా లేదని.. ప్రమాదానికి ముందే అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ బస్సు పరిస్థితి బాగా లేదని ముందే డ్రైవర్‌తో చెప్పారు. ఈ క్రమంలోనే యర్రగొండపాలెం వద్ద బస్సును గంటసేపు నిలిపేసిన డ్రైవర్.. దానికి మరమ్మతులు చేసినట్లు ప్రయాణికులు వెల్లడించారు. రిపేర్ల తర్వాత బస్సు బయల్దేరి కొంత దూరం వెళ్లిన తర్వాత రాయవరం వద్ద ఈ ఘోర ఘటన జరిగినట్లు చెప్పారు. ఈ ప్రమాదం తర్వాత అధికారులు బస్సు డ్రైవర్‌ను విచారణ జరపగా.. స్టీరింగ్‌ స్ట్రక్‌ అయినట్లు చెప్పినట్లు సమాచారం.కానీ ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బస్సు క్లీనర్ మహేంద్ర వాదన మాత్రం మరో రకంగా ఉంది. బస్సు ప్రమాదం నుంచి మొట్టమొదటగా తానే ప్రాణాలతో బయటపడినట్లు తెలిపాడు. తాను నిద్రపోతున్న సమయంలో ప్రమాదం జరిగిందని.. లేచి చూసేసరికి బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుందని పేర్కొన్నాడు. మంటలను ఆర్పే సిలిండర్లు బస్సులో ఉన్నాయని.. కానీ దట్టమైన పొగ కారణంగా అవి కనిపించలేదని వివరించాడు. చాలా మంది అద్దాలు పగలగొట్టి బయటపడి ప్రాణాలు రక్షించుకున్నారని తెలిపాడు. బస్సు కండీషన్ బాగానే ఉందని క్లీనర్ మహేంద్ర చెప్పాడు. మరోవైపు.. ఈ మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఈ ఘటనలో చనిపోయిన వారికి ఏపీ కేబినెట్ సంతాపం తెలియజేసింది. అదే సమయంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. ఇక ఈ ఘోర ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు.. గాయాల పాలైన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. బాధితులకు మెరుగైన ట్రీట్‌మెంట్ అందించాలని.. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బస్సు ప్రమాదంపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ప్రమాదం తీరుపై ప్రాథమిక సమాచారాన్ని జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు అనిత, జనార్దన్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరోవైపు.. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. బస్సు మంటల్లో కాలి బూడిదై అందులో ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదమని మోదీ పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో ఉన్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇక మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు.. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మార్కాపురం బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ బస్సు ప్రమాద ఘటనపై ఏపీ అధికారులతో మాట్లాడాలని సీఎస్‌ రామకృష్ణారావును ఆదేశించారు. ప్రమాదానికి గురైన బస్సు జగిత్యాల నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ఇక్కడి ప్రయాణికులు ఎవరైనా ఉన్నారా అనే వివరాలు తెలుసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఏపీ సీఎస్‌తో తెలంగాణ సీఎస్‌ మాట్లాడారు.