తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు.. ఆర్జిత సేవలు రద్దు

Wait 5 sec.

తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి వారు నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు. వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత మలయప్పస్వామివారికి స్నపనతిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిద్రోదకం(పసుపు), గంధోదకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనసాగమోక్తంగా అర్చకులు చేపట్టారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమజాతి పుష్పమాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లు సాయంత్రం అక్కడి నుండి బయల్దేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.ఇవాళ శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఆ తర్వాత వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే ఏప్రిల్ 01వ తేదీన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు. ఎండ వేడి నుండి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ”ఉపశమనోత్సవం” అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతోపాటు పలురకాల మధురఫలాలను స్వామివారికి నివేదిస్తారు. ఈ వేడుకల కోసం వట్టివేరుతో ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు. అలాగే వేలాడే కోతులు, ఏనుగులు, సింహాలు, పులులు, నెమళ్లు, పాముల తదితర జంతువులు, పలురకాల చెట్ల ప్రతిరూపాలతో శేషాచల అడవిని తలపించేలా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. వసంతోత్సవాల కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 01వ తేదీ వరకు మూడురోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు. అలాగే ఇవాళ అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేసింది టీటీడీ.