తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్వల్పంగా ఊరట దక్కింది. హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే 65పై టోల్ రుసుములు స్వల్పంగా తగ్గనున్నాయి. ఏప్రిల్ ఒకటి నుంచి (మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి) ఈ కొత్త రుసుములు అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. వివిధ రకాల వాహనాలకు రూ.5 చొప్పున తగ్గించారు. పంతంగి టోల్‌ప్లాజా దగ్గర టోల్ ఫీజుల విషయానికి వస్తే.. 3 యాక్సిల్‌ కమర్షియల్‌ వాహనాలకు రూ.5 చొప్పున ఫీజు తగ్గించారు. సింగిల్ (ఒకవైపునకు) రూ.290 నుంచి 285కు తగ్గింది. ఒకవేళ 24 గంటల్లో ఇరువైపులా ప్రయాణానికి 435 నుంచి 430కి తగ్గింది. కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా దగ్గర 3 యాక్సిల్‌ కమర్షియల్‌ వాహనాలకు రూ.5 చొప్పున రుసుము తగ్గింది. అక్కడ (సింగిల్) ఒకవైపునకు రూ.450 నుంచి రూ.445కి.. అదే 24 గంటల్లో ఇరువైపులా ప్రయాణానికి రూ.675 నుంచి రూ.670కి తగ్గింది.కారు, జీపు, వ్యాన్‌, లైట్ మాటార్ వాహనాలకు.. పంతంగి దగ్గర ఒకవైపు అయితే రూ.80, రెండువైపులా అయితే 115.. అదే కొర్తపహాడ్ దగ్గర అయితే ఒకవైపు రూ.120, రెండు వైపులా అయితే రూ.180 రుసుము చెల్లించాలి. లైట్ కమర్షియల్, లైట్ గూడ్స్, మినీ బస్సు అయితే పంతంగి టోల్ గేట్ దగ్గర ఒకవైపు రూ.265, రెండు వైపులా రూ.395.. కొర్లపహాడ్ దగ్గర ఒకవైపు రూ.195, రెండు వైపులా రూ.250 రుసుము చెల్లించాలి. బస్సు/ట్రక్కు (2 యాక్సిల్) పంతంగి టోల్ గేట్ దగ్గర ఒకవైపు అయితే రూ.265, రెండు వైపులా అయితే రూ.395. కొర్లపహాడ్ దగ్గర ఒకవైపు అయితే రూ.410, రెండు వైపులా అయితే రూ.615 రుసుము చెల్లించాలి. కమర్షియల్ వెహికల్స్ (3 యాక్సిల్) ఒకవైపు అయితే రూ.285, రెండు వైపులా అయితే రూ.430.. కొర్లపహాడ్ టోల్‌గేట్ దగ్గర ఒకవైపు అయితే రూ.445, రెండు వైపులా అయితే రూ.670గా నిర్ణయించారు. అయితే మిగిలిన వాటికి రేట్లు యథాతథంగా ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి వాహనదారులు టోల్‌గేట్ల దగ్గర ఈ కొత్త రుసుముల్ని గమనించాలని సూచిస్తున్నారు అధికారులు.