ఏపీలో పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో తీపికబురు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ 2029 నాటికి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించామని.. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి గృహప్రవేశాలు చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం 2.50 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తున్నామని.. రాష్ట్రంలో మొత్తం 5.50 లక్షల ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు ఇచ్చామన్నారు. అంతేకాదు మరో 4.50 లక్షల ఇళ్లను డిసెంబర్‌లోపు కట్టించి అందజేస్తామని తెలిపారు. తిరుపతి జిల్లా పుదూరులోని టిడ్కో ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారులకు ఇవ్వాల్సిన రూ.920 కోట్లు చెల్లించలేదని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని చెల్లించామన్నారు. అంతేకాదు గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం డిపాజిట్లు చెల్లించినవారికి తిరిగి ఇవ్వలేదన్నారు.. మొత్తం 82 వేల మందికి రూ.174 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. ఈ నెలలోనే ఆ బకాయలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో గృహ నిర్మాణానికి ఇచ్చిన నిధులు మళ్లించారని.. దీంతో కేంద్రం రూ.28 కోట్ల జరిమానా విధించిందన్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో ఇళ్లు కట్టేందుకు స్థలాలు ఇచ్చారన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికీ పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ) కనెక్షన్‌ ఇస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ పీఎన్‌జీకి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇళ్లో కుళాయి తిప్పగానే నీళ్లు వచ్చినట్లుగా.. స్టవ్‌ నాబ్‌ తిప్పితే గ్యాస్‌ రావాలి అన్నారు. ప్రస్తుతం దీపం-2 పథకం కింద ఇస్తున్న డబ్బుల్ని వారికి కూడా ఇస్తామన్నారు. మహిళలు ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నామని.. ప్రజల కోసం వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తు్న్నామని.. ఒకటో తేదీని పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. స్త్రీశక్తి కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధితో పాటుగా సంక్షేమం అందిస్తున్నామన్నారు చంద్రబాబు.తాను ఏప్రిల్ నుంచి ఆకస్మిక తనిఖీలకు వస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటుగా ఎక్కడైనా అవినీతి జరిగితే అడ్డుకుంటామన్నారు. అలాగే రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఒక్క రూపాయి అవినీతి జరగడానికి వీల్లేదన్నారు. ఒక్క నిమిషం ఆలస్యం చేయొద్దు.. పనిచేయని వారిని ప్రజల ముందుంచి ప్రశ్నిస్తామన్నారు. రియల్‌టైమ్‌ ద్వారా ఏ శాఖ పనితీరు ఎలా ఉందో గమనిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు.