టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. గత ఐదు దశాబ్దాలుగా భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ఆయనకు ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ’ వేడుకల్లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రధానం చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా బాలయ్యకు ఈ పురష్కారం అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ’ (IFFD 2026) వేడుకలు బుధవారం సాయంత్రం దేశ రాజధానిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ‘భారత్ మండపం’ ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు వేదికైంది. సీఎం రేఖా గుప్తాతో పాటు మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేశ్‌ సాహిబ్ సింగ్ వర్మ, నటీమణులు హేమ మాలిని, కంగనా రనౌత్, షర్మిలా ఠాగూర్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. బాలయ్యతో పాటుగా అలనాటి నటి షర్మిలా ఠాగూర్, దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్రలను కూడా జీవితకాల సాఫల్య పురష్కారాలతో గౌరవించారు. దివంగత లెజండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలకృష్ణ.. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. నటనలో, డైలాగ్ డెలివరీలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. టాలీవుడ్ నాలుగు పిల్లర్స్ లో ఒకరిగా ఎదిగిన బాలయ్య.. తెలుగు చిత్ర పరిశ్రమలో 50 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నారు. సినీ రంగంతో పాటుగా ఇతర రంగాల్లోనూ ఆయన విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం హిందూపూర్ ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేస్తున్న బాలకృష్ణ.. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా ఉంటూ, ఎందరికో వైద్య సహాయం అందిస్తున్నారు. ఆయన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం 'పద్మభూషణ్' పురష్కారంతో సత్కరించిన సంగతి తెలిసిందే. గతేడాది తెలంగాణ ప్రభుత్వం తన తండ్రి పేరు మీదుగా ఏర్పాటు చేసిన 'ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్'ను బాలయ్య అందుకున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ వేడుకల్లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును స్వీకరించారు. బాలయ్యకు ఈ అరుదైన గౌరవం దక్కడంపై నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.