ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో అవినీతి జరుగుతోందని.. సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆలయంలో అడుగడుగునా డబ్బులు అడుతున్నారని వీడియోలో మహిళ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ వైరల్ వీడియోపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే స్పందించారు. శ్రీకాళహస్తి ఆలయ ఈవో బి.కె.వెంకటేశులుతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళ ఆరోపణలను ఖండించిన సుధీర్ రెడ్డి.. అందులో నిజం లేదని అన్నారు. యూఎస్ఏకు చెందిన జ్యోతి దువ్వూరి అనే మహిళ మార్చి 24న శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించారని.. దర్శనం తర్వాత ఆలయంపై ఆరోపణలు చేస్తూ వీడియో పోస్టు చేసినట్లు సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపామని.. ఈ క్రమంలోనే పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించినట్లు వెల్లడించారు.మహిళ శ్రీకాళహస్తి ఆలయంలోకి ప్రవేశించింది మొదలు.. దర్శనం పూర్తయ్యే వరకూ సీసీ కెమెరాలను పరిశీలించినట్లు సుధీర్ రెడ్డి తెలిపారు. ఆలయంలో ఎవరూ మహిళను డబ్బులు అడగలేదని, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తే ఆమె ప్రశాంతంగా దర్శనం చేసుకున్నట్లు స్పష్టమైందని వివరించారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో భక్తుల నుంచి అదనపు వసూళ్లు చేస్తున్నారంటూ జ్యోతి దువ్వూరి చేసి ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని.. పవిత్రమైన పుణ్యక్షేత్రంపై బురదజల్లి భక్తులను అయోమయానికి గురిచేయడం అత్యంత బాధాకరమని సుధీర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలి తప్ప, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయవద్దని కోరారు. ఇదే సమయంలో మహిళ శ్రీకాళహస్తి ఆలయంలో దర్శనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజీని తన అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా సుధీర్ రెడ్డి షేర్ చేశారు.సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తే ఆరోపణలు చేసిన జ్యోతి దువ్వూరి.. 9 నిమిషాల పాటు ప్రశాంతంగా స్వామి దర్శనం చేసుకున్నట్లు తెలిసిందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెల్లడించారు. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదన్న బొజ్జల సుధీర్ రెడ్డి.. అలాంటి వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో రీల్స్, వీడియోలు తీసే వారిపైనా చర్యలు ఉంటాయని సుధీర్ రెడ్డి హెచ్చరించారు. మరోవైపు తాను శ్రీకాళహస్తి ఆలయ దర్శనానికి వెళ్లినప్పుడు.. గేటు వద్ద ఉన్న గార్డు నుంచి లోపల పోలీసుల వరకూ అడుగు అడుగునా డబ్బులు డిమాండ్ చేసినట్లు వీడియోలో మహిళ ఆరోపించారు. ఈ వీడియో వైరల్ కావటంతో సుధీర్ రెడ్డి, దేవస్థానం అధికారులు స్పందించారు.