కాంగ్రెస్ పార్టీ .. తమ సొంత ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిషలు పోరాటం చేసిన ఉద్యమకారులకు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలని ఆమె శాసనమండలిలో డిమాండ్‌ చేశారు. తెలంగాణ కోసం పోరాటం చేసి.. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు.. ఆ కుటుంబాలకు నెలకు రూ.25 వేల చొప్పున పింఛన్‌ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్సీ విజయశాంతి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చాలని సూచించారు.తెలంగాణ ఉద్యమకారులపై రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని.. అదే విధంగా ప్రభుత్వ గుర్తింపు కార్డు కూడా ఇస్తామని తమ పార్టీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన విజయశాంతి.. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి అయిపోయినా.. తెలంగాణ ఉద్యమకారులకు మాత్రం ఇంకా న్యాయం జరగలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఇప్పుడు ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్న ఎమ్మెల్సీ విజయశాంతి.. వారికి ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.ఈ క్రమంలోనే రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులు లేకపోతే.. ప్రస్తుతం తెలంగాణలో సీఎంలు గానీ.. మంత్రులు గానీ ఉండేవారా అని విజయశాంతి నిలదీశారు. పదవుల కంటే ముందు ఉద్యమకారులు చేసిన త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన తప్పనిసరి బాధ్యత అని విజయశాంతి గుర్తు చేశారు. ఆ బాధ్యతను కాంగ్రెస్ సర్కార్ సరిగ్గా నిర్వర్తిస్తేనే అది చరిత్రగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలా కాకుండా ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది.. పెద్ద చారిత్రక తప్పిదంగా చరిత్రలో మిగిలిపోతుందని తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి.. వారికి తగిన గౌరవంతోపాటు.. పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉందని విజయశాంతి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సున్నితమైన హెచ్చరికలు చేశారు.