ప్రయాణికులు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. బస్ టికెట్లపై 30 శాతం డిస్కౌంట్

Wait 5 sec.

ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా.. చమురు సరఫరా నిలిచిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ కొరత ఉందన్న వార్తలు నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న వేళ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు పెంచేందుకు చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. హైదరాబాద్ నగర పరిధిలో తిరిగే బస్సుల్లో ఇచ్చే టికెట్లపై 30 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. అయితే కేవలం మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో మాత్రమే ఈ 30 శాతం డిస్కౌంట్ వర్తిస్తుందని ప్రకటించింది. ‘పెట్రోల్‌ కష్టాలు పడటం ఎందుకు దండగ.. ఆర్టీసీ బస్సులు ఉండగా’ అని ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో వేచి చూసి.. అనవసరంగా సమయాన్ని వృథా చేసుకోవద్దని.. సురక్షితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ఆర్టీసీ ఎండీ కీలక సూచనలు చేశారు.పెట్రోల్ కష్టాల నుంచి హైదరాబాద్ నగర ప్రజలకు విముక్తి కల్పించడంతోపాటు.. ప్రజా రవాణాను మరింత ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కొన్ని పెట్రోల్ బంకులు మూతపడటం, మిగిలిన పెట్రోల్ పంపుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో.. ప్రభుత్వ రవాణాను ఉపయోగించుకోవాలని హితవు పలుకుతున్నారు. బైక్‌లు, కార్లలో ఒక్కరు వెళ్లి పెట్రోల్, డీజిల్‌ను అనవసరంగా వృథా చేయడం కంటే.. ఆర్టీసీ బస్సులు ఎక్కి ఆఫీసులు, పనులకు వెళ్లి.. వాటిని ఆదా చేయవచ్చని సూచిస్తున్నారు. నగరం నలుమూలలకు ఏసీ, డీలక్స్ బస్సులను ఆర్టీసీ నడుపుతోందని.. తాజాగా ప్రకటించిన 30 శాతం డిస్కౌంట్‌ను ప్రయాణికులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ప్రయాణికుల కోసం హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 3200 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. ప్రధాన రూట్లలో బస్సులను మరింత పెంచి.. సకాలంలో నగరవాసులు గమ్యస్థానాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రయాణికుల రద్దీ పెరిగితే.. అందుకు అనుగుణంగా డిపోల్లో ఉన్న రిజర్వ్ బస్సులను కూడా నడిపేందుకు ఆర్టీసీ రెడీగా ఉందని స్పష్టం చేశారు.