చాట్ జీపీటీ సాయంతో ఇల్లు అమ్మిన వ్యక్తి.. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చెప్పిన రేటు కంటే ఎక్కువ ధర.. భలే సలహాలిచ్చిందిగా..!

Wait 5 sec.

ఇల్లు అమ్మడానికి లేదా కొనడానికి మనలో చాలా మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లను ఆశ్రయిస్తుంటారు. మనం ఒక ధర చెబితే.. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తమ నెట్‌వర్క్‌ను ఉపయోగించి ఇల్లు అమ్మిపెడతారు. దీనికి కొంత మొత్తం కమీషన్ తీసుకుంటారు. అయితే కొందరు ఏజెంట్లు అత్యాశకు పోయి.. ఎక్కువ కమీషన్ తీసుకోవడం కోసం.. ఇంటి ధరను పెంచి చెప్పి, వచ్చిన పార్టీలను చెడగొడుతుంటారు. లేదంటే మార్కెట్ రేట్ కంటే తక్కువ రేటు చెప్పి మనకొచ్చే ఆదాయానికి గండి కొడతారు. అయితే అమెరికాకు చెందిన ఓ వ్యక్తి సాయంతో తన ఇంటిని రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చెప్పిన రేటు కంటే ఎక్కువ ధరకు విక్రయించాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..మియామికి చెందిన రాబర్ట్ లెవిన్ అనే వ్యక్తి తన ఇల్లును అమ్మాలని భావించాడు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లను సంప్రదించగా.. వాళ్లు ఒక రేటు చెప్పారు. లెవిన్‌కు ఎందుకో ఏఐ టూల్ చాట్ జీపీటీ సాయం తీసుకోవాలని అనిపించింది. తన ఇంటికి సంబంధించిన వివరాలను చాట్ జీపీటికి ఇచ్చాడు. అంతే.. ఇంటి ధర నిర్ణయించడం మొదలు, లిస్టి్ంగ్ ప్రిపేర్ చేయడం, మార్కెటింగ్ కంటెంట్ రూపొందించడం.. ఇలా ప్రతి పనిని చాట్ జీపీటీ చాలా ఈజీగా చేసి పెట్టింది.అంతే కాదు ఇల్లు అమ్మకానికి ఉందనే యాడ్‌ను ఫలానా టైంలో పోస్టు చేశావంటే.. కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వస్తుందంటూ లెవిన్‌కు చాట్ జీపీటీ ఓ సూచన కూడా ఇచ్చింది. ఏఐ టూల్ చెప్పినట్టే చేసిన లెవిన్‌కు ఇంటి విక్రయం గురించి ప్రకటన ఇచ్చిన మూడు రోజుల్లోనే ఐదు ఆఫర్లు వచ్చాయి. వారం కంటే తక్కువ టైంలోనే డీల్ పూర్తయ్యింది.‘‘ఇల్లు అమ్మేద్దామని అనుకుంటున్నావ్ కదా.. అయితే ఇంట్లో అక్కడక్కడా పెయింటింగ్ బాగోలేదు. కాబట్టి ఫలానా ప్రదేశాల్లో పెయిటింగ్ వేస్తే బాగుంటుంది. ఇంటికి రంగులేయడానికి నువ్వే పెట్టే ప్రతి పైసా ఖర్చుకు ఎన్నో రెట్ల ప్రతిఫలం వస్తుంది’’ అని లెవిన్‌కు చాట్ జీపీటీ సలహా ఇచ్చిందట. దీంతో దాని సలహాను తూచా తప్పకుండా పాటించిన లెవిన్.. ఇంట్లో కొన్ని గదులకు రంగులు వేయించాడు. ఆకర్షణీయమైన రంగులతో, అందంగా ఉన్న ఇంటిని చూసి కొనుగోలుదారులు ముచ్చటపడ్డారు. దీంతో లెవిన్ అనుకున్న దానికంటే ఎక్కువ రేటుకు కొనుగోలు చేశారు. ‘సార్.. మీరు ఈ ఇంటిని 8.5 లక్షల డాలర్లకు విక్రయిస్తే మంచి రేటు వచ్చినట్టే’ అని రియల్ ఎస్టేట్ ఏజెంట్లు లెవిన్‌‌కు చెప్పారట. కానీ చాట్ జీపీటీ సాయంతో అతడు 9.54 లక్షల డాలర్లు అంటే దాదాపు ఒక మిలియన్ డాలర్లకు తన ఇంటిని విక్రయించాడట. దీంతో ఏజెంట్లకు ఇచ్చే కమీషన్‌ మిగలడంతోపాటు.. లక్ష డాలర్లు అదనంగా వచ్చాయి. అయితే పేపర్ వర్క్ పూర్తి చేసే విషయంలో మాత్రం లాయర్ సాయం తీసుకున్నాడట. ప్రొఫెషనల్స్‌ను ఏఐ పూర్తిగా రీప్లేస్ చేయలేకపోయినప్పటికీ.. దాని సలహాల వల్ల డబ్బులు మాత్రం మిగిలాయని లెవిన్ చెబుతున్నాడు. ఈ చొప్పున చూస్తే.. రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో పని లేకుండా మనం కూడా ఏఐ సాయంతో మన ఆస్తులను మంచి రేటుకు అమ్ముకోవచ్చేమో కదా..!!