AP Weather: ఎండల నుంచి ఉపశమనం.. మంగళవారం ఈ జిల్లాల్లో వానలు..

Wait 5 sec.

మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపశమనం కలగనుంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం రోజున (మార్చి 31) పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లా , పోలవరం, కర్నూలు, నంద్యాల జిల్లాలలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం జిల్లాలలోతేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కొన్ని జిల్లాలకు తీవ్ర వడగాల్పుల హెచ్చరికమరోవైపు కొన్ని జిల్లాలలో వర్షాలు కురుస్తున్నప్పటికీ.. మరికొన్ని జిల్లాలలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మండలాల్లో మంగళవారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని.. గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మవలస, కొమరాడ, కురుపాం, సీతానగరం మండలాలతో పాటుగా .. పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలోని 13 మండలాలలో రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని మండలాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. సోమవారం రోజున కడప జిల్లాలోని ఒంటిమిట్ట, ఖాజీపేటలో అత్యధిక ఉష్ణోగ్రత 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లా లద్దగిరిలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. తీవ్ర వడగాల్పుల సమయంలో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవటంతో పాటుగా.. ఎండ వేడిమి నుంచి రక్షణగా టోపీలు, గొడుగులు వెంట తీసుకుని వెళ్లాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.