మరోసారి తీన్మార్ మల్లన్న పాదయాత్ర.. జూన్ 2 నుంచి ప్రారంభం, రూట్ మ్యాప్ రెడీ

Wait 5 sec.

రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు రాజ్యాధికారం తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించిన (చింతపండు నవీన్ కుమార్).. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సభలు ఏర్పాటు చేసి.. బీసీల హక్కులు, అధికారాలు, రాజకీయ చైతన్యం కోసం పోరాటం చేస్తున్న తీన్మార్ మల్లన్న.. ఇక రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా భారీ పాదయాత్రను నిర్వహించనున్నట్లు తాజాగా వెల్లడించింది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. చేపట్టనున్నట్లు టీఆర్పీ ప్రకటించింది. బీసీలకు, వెనుకబడిన తరగతులకు రాజ్యాధికారం కల్పించడం కోసమే.. ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక రాష్ట్రవ్యాప్త పాదయాత్ర కోసం ఇప్పటికే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో బీసీలకు సామాజిక న్యాయం, రాజకీయ హక్కులు, అధికారంలో బీసీలకు భాగస్వామ్యం కల్పించడమే ధ్యేయంగా తీన్మార్ మల్లన్న సుదీర్ఘ పాదయాత్ర కొనసాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.గతంలో ఎమ్మెల్సీ కాకముందు తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేశారు. అయితే అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కాకుండా.. తీన్మార్ మల్లన్న పాదయాత్ర కొన్ని ప్రాంతాలకే పరిమితం అయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చేపట్టనున్న పాదయాత్రను.. రాష్ట్రం మొత్తం తిరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ పాదయాత్ర ఒక ప్రదర్శన లాగా మాత్రమే కాకుండా.. క్షేత్రస్థాయిలో వెనుకబడిన వర్గాలకు మద్దతు కల్పించే ఒక వేదికగా నిలవనుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రతీ గ్రామంలో పర్యటించి.. బీసీల సమస్యలను తెలుసుకోవమే కాకుండా.. వెనుకబడిన తరగతుల రాజకీయ సాధికారతకు కావాల్సిన మద్దతును కూడా తీన్మార్ మల్లన్న కూడగట్టనున్నారు. ఇప్పటికే పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. అయితే ఏ జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.. ఏయే దశల్లో సాగుతుంది అనే పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు టీఆర్పీ వర్గాలు తెలిపాయి.