ఏపీలో వృద్ధులకు సీనియర్ సిటిజన్ కార్డులు ఉచితం.. ఇకపై ఈజీగా తీసుకోవచ్చు, ఆర్టీసీ బస్సుల్లో రాయితీ

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీని పటిష్ఠంగా అమలు చేయాలని వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఆదేశించారు. రాష్ట్రంలో వృద్ధులకు ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డులు ఇస్తున్నామని.. మన మిత్ర వాట్సాప్ ద్వారా ఈ కార్డుల్ని ఉచితంగా తీసుకోవచ్చని తెలిపారు. అర్హులైన వారందరికి కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అమరావతి సచివాలయంలోని కార్యాలయంలో మంత్రి స్వామి సీనియర్‌ సిటిజన్స్‌ రాష్ట్ర కౌన్సిల్‌ 3వ సమావేశం, దివ్యాంగుల రాష్ట్ర సలహా బోర్డు సమావేశం నిర్వహించారు. త్వరలోనే రాష్ట్రంలో దివ్యాంగులకు రుణ రాయితీ పథకం అమలు చేస్తామని మంత్రి స్వామి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగ శక్తి పథకాన్ని అమలు చేశామని గుర్తు చేశారు. దివ్యాంగ భవన్‌లను రాజధాని అమరావతితోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తామని.. టిడ్కో ఇళ్లలో దివ్యాంగ లబ్ధిదారులకు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఫ్లాట్లు కేటాయిస్తామన్నారు. అలాగే వృద్ధులకు సైబర్‌ నేరాల పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులకు నెలకు రూ.4 వేల చొప్పున పింఛన్ అందిస్తున్నాము అన్నారు. కూటమి ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం అన్ని చర్యలూ తీసుకుంటోంది అన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో వయోవృద్ధులకు గుర్తింపుగా సీనియర్‌ సిటిజన్‌ కార్డు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్డుల్ని గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవా, ఇంటర్నెట్‌ కేంద్రాల్లో తీసుకోవచ్చు. కొత్తగా మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఈ కార్డుల్ని తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన పురుషులు, 58 ఏళ్లు నిండిన మహిళలు ఈ కార్డులు తీసుకోవచ్చు. ఈ కార్డుతో ఎన్నో ఎన్నో సేవల్ని పొందే అవకాశం ఉంది. ఈ సీనియర్‌ సిటిజన్‌ కార్డుపై బ్లడ్‌ గ్రూప్, ఎమర్జెన్సీలో సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు కూడా ఉంటాయి. ఈ సీనియర్ సిటిజన్ కార్డును నిమిషాల్లోనే ఇచ్చేస్తారు. ఈ కార్డు కావాల్సిన వాళ్లు.. ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ధ్రువపత్రం వంటివి తీసుకెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ కూడా ఉండాలి. గతంలో డబ్బులు వసూలు చేసేవాళ్లు.. కానీ ఇప్పుడు ఉచితంగానే ఇస్తున్నారు. ఈ కార్డుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్‌లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల్లో రాయితీలు పొందవచ్చు. బ్యాకింగ్, పోస్టాఫీసుల్లో డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ వస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో 25శాతం రాయితీ కూడా ఇస్తారు.. రైళ్లలో లోయర్ బెర్త్‌లు పొందవచ్చు. ఇంకా మరికొన్ని సేవల్ని పొందొచ్చు.