పట్టణ వృద్ధిలో 'హైదరాబాద్' హవా.. జీసీసీ హబ్‌గా అవతరణ.. ఢిల్లీ, ముంబైలకు గట్టి పోటీ!

Wait 5 sec.

Hyderabad: భారత దేశ పట్టణ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని దక్షణ భారత్‌లోని టెక్ హబ్‌లు అయిన బెంగళూరు, హైదరాబాద్ నగరాలు మారుస్తున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. దేశ పట్టణ వృద్ధిని వేగవంతం చేయడంలో ఈ రెండు నగరాలే సగానికి పైగా తోడ్పాటు అందిస్తున్నాయని పేర్కొంది. అలాగే ఉద్యోగాలు, వినియోగం, రవాణా, భారత నగరాల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేలా ఈ రెండు నగరాలు ప్రభావం చూపిస్తున్నట్లు రిపోర్ట్ తెలిపింది. . ఈ నివేదికను ఢిల్లీలో జరిగిన ఇండియాస్పోరా గ్లోబల్ ఏఐ సబ్మిట్ 2026 వేదికగా విడుదల చేశారు. గడిచిన 5 సంవత్సరాల్లో భారత్‌లోని టాప్ నగరాల్లో పెరిగిన గ్రేడ్ ఏ ఆఫీసు స్థలాల విస్తీర్ణంలో హైదరాబాద్, బెంగళూరు నగరాల వాటానే 53 శాతం ఉన్నట్లు రిపోర్ట్ పేర్కొంది. భారత్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతోన్న టెక్ హబ్‌లుగా బెంగళూరు, హైదరాబాద్ నిలిచాయని, భారత ఆర్థిక వ్యవస్థపై ఢిల్లీ ఎన్‌సీఆర్, గ్రేటర్ ముంబై సాగిస్తున్న ఆధిపత్యానికి సవాలు విసురుతున్నట్లు రిపోర్ట్ పేర్కొంది. ఢిల్లీ ఎన్‌సీఆర్, గ్రేటర్ ముంబై నగరాల్లోని జనాభా కంటే హైదరాబాగ్, బెంగళూరు నగరాల్లో జనాభా తక్కువగా ఉన్నప్పటికీ తమ శక్తికి మించి రాణిస్తున్నట్లు తెలిపింది. గత రెండు సంవత్సరాల్లో భారత్‌లోని టాప్-8 నగరాల్లో పెరిగిన మొత్తం దేశీయ విమాన సర్వీసుల్లో ఏకంగా 50 శాతం వాటా హైదరాబాద్, బెంగళూరు నుంచే ఉండడం గమనార్హం. అలాగే 2024-25లో దేశంలోని దిగ్గజ నగరాల్లో రిజిస్టర్ అయిన ప్రతి 4 కంపెనీల్లో ఒకటి హైదరాబాద్ లేదా బెంగళూరుకు చెందినదిగా నివేదిక పేర్కొంది. భారత స్టార్టప్ కంపెనీలకు కేంద్రంగా బెంగళూరు కొనసాగుతోందని, ఐటీ, ఫార్మా, తయారీ, బీఎఫ్ఎస్ఐ రంగాల్లో ప్రారంభ స్థాయి నియామకాల పరంగా చూసుకుంటే సైతం ఈ రెండు నగరాలదే హవాగా పేర్కొంది. పలు విభాగాల్లో ఢిల్లీ, ముంబై నగరాలను సైతం వెనక్కి నెట్టాయని తెలిపింది.