హైదరాబాద్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా.. 70 క్వింటాళ్ల స్వాధీనం, యాసిడ్‌లతో తయారీ

Wait 5 sec.

ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా నకిలీలు, కల్తీలు ఎక్కువవుతున్నాయి. ఏది చూసినా ఫేక్ తయారీ చేసి.. డబ్బులు దండుకుంటున్నారు. ఇలాంటి నకిలీలు వస్తువుల వరకు అయితే పర్లేదు కానీ.. మనుషులు తినే ఆహార పదార్థాలను కూడా వదలకుండా కొందరు కేడీలు కల్తీలకు పాల్పడుతున్నారు. పసి పిల్లలు తాగే పాల దగ్గరి నుంచి.. ప్రతీ ఒక్క ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రాణాలకు హాని కలిగించే రసాయన పదార్థాలతో ఆహార పదార్థాలను తయారు చేసి.. వాటిని కంపెనీ పేర్లతో ప్యాకింగ్ చేసి మరీ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. అయితే అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు, దాడులు చేసి పట్టుకుంటున్నా.. మిగిలిన వారు మాత్రం కల్తీలను ఆపడం లేదు. తాజాగా హైదరాబాద్‌ అత్తాపూర్‌లో భారీ ఎత్తున నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేస్తున్న ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు. డెక్కన్‌ ట్రేడర్స్‌ పేరుతో నిర్వహిస్తున్న గోదాంలపై దాడులు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో ఏకంగా 70 క్వింటాళ్ల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను సీజ్ చేశారు. డేంజరస్ కెమికల్స్‌తో తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ జూబ్లీహిల్స్ జోన్ టీమ్, ఫుడ్ అడల్టరేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు నిందితులు కలిసి ఎం.ఎం.పహాడీలోని 2 వేర్వేరు ప్రాంతాల్లో గోదాంలను నిర్వహిస్తూ ఈ కల్తీ దందాను నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అతి తక్కువ ఖర్చుతో భారీగా లాభాలను పొందాలనే అత్యాశతో ఈ కల్తీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారని వెల్లడించారు. ఎసిటిక్ యాసిడ్, శాంటిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్, అల్లం వెల్లుల్లి పొట్టు కలిపి.. ఈ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. అసలే కల్తీ.. ఆపై వాటిని తయారు చేసే ప్రాంతం కూడా చాలా దారుణంగా ఉందని తెలిపారు. ఈగలు, దోమలు, దుమ్ము ధూళితో ఈ గోదాం అత్యంత అపరిశుభ్రంగా ఉందని అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఇలా కల్తీ చేసి తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి.. నగరంలోని హోల్‌సేల్, రిటైల్ కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అదే సమయంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లకు క్యాటరింగ్ సర్వీసులు చేసేవారికి కూడా ఈ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను విక్రయిస్తున్నట్లు తేల్చారు. ఈ క్రమంలోనే ఆ ముగ్గురు నిందితులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు.. కాటేదాన్‌లో నిర్వహిస్తున్న ఒక అక్రమ ఆహార తయారీ కేంద్రంలోనూ మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు దాడులు చేపట్టారు. అక్కడ ఉన్న ఇంద్ర సొసైటీ పరిధిలో రూల్స్‌ను అతిక్రమించి.. అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కుళ్లిపోయిన కోడిగుడ్లు, డేంజరస్ కెమికల్స్ కలిపి.. పిల్లలు తినే డోనట్ బన్స్, కేకులను తయారు చేస్తున్నారని తేల్చారు. ఈ దాడుల్లో ముగ్గురి నిందితులను గుర్తించి.. మైలార్‌దేవ్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.