పెట్రోల్‌ ఉచితంగా పంచుతోన్న హైదరాబాదీ.. ‘భాయ్, భారత్ మాతా కీ జై అనొద్దు ఇక్కడ’.. వీడియో వైరల్

Wait 5 sec.

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. భారత్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. వంట గ్యాస్, పెట్రోల్ కోసం ప్రజలు ముందు జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా . అందరూ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటుండటం, క్యాన్‌లలోనూ నింపుకొని పోతుండటంతో.. బంకుల్లో పెట్రోల్ త్వరగా అయిపోతోంది. దీంతో పెట్రోల్ కృత్రిమ కొరత ఏర్పడుతోంది. దేశంలో వాహనదారులు మాత్రం బంకుల ముందు క్యూ కడుతూనే ఉన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో సయద్ అయుబ్ అనే హైదరాబాదీ ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తున్నారు. చెరకు రసం విక్రయించే బాటిళ్లలో పెట్రోల్ నింపి ఆటోడ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ లాంటి వారికి ఫ్రీగా అందిస్తున్నారు. అయితే ఓ పెట్రోల్ బంకు వద్ద ఆయన ఉచితంగా పెట్రోల్‌ను అందించే క్రమంలో కొందరు భారత్ మాతా కీ జై అని నినాదాలు చేశారు. దీనికి స్పందించిన అయూబ్.. ‘భాయ్, భారత్‌ మాతా కీ జై లాంటి నినాదాలు చేయకండి. భారతదేశానికి సమస్య వచ్చినప్పుడు, అండగా ఉండటంలో భారతీయ ముస్లింలు ఎప్పుడూ ముందే ఉంటున్నారు. మీరు ఇలా చేయకండి, మతాన్ని ఇందులోకి తీసుకురాకండి. ఇక్కడ హిందువులు, ముస్లిలంతా ఒక్కటే’’ అని అయూబ్ వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పట్ల కొందరు సానుకూలంగా స్పందిస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రతికూలంగా స్పందిస్తున్నారు. భారత్ మాతా కీ జై మతపరమైన నినాదం అంటే.. వంద రూపాయల పెట్రోల్ కోసం.. నినాదాలు చేయడం ఆపేస్తారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సందర్భంలో అలాంటి నినాదాలు చేయాల్సిన అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఎవరీ అయూబ్..? హైదరాబాద్ యూత్ కరేజ్ (హెచ్‌వైసీ) అనే సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా సామాజిక సేవ చేస్తుంటారు. ఆహరం పంపిణీ, ఉచితంగా పెట్రోల్ పంచడం, గాజా బాధితులకు సాయం చేయడం లాంటి కార్యక్రమాలు చేపడుతుంటారు. హెచ్‌వైసీ సంస్థ హైదరాబాద్‌లో కిస్మత్‌పుర నుంచి ఈ కార్యక్రమాలను చేపడుతోంది. క్రౌడ్ ఫండింగ్ నిధుల విషయంలో మోసం జరిగిందనే ఆరోపణలతో సైదాబాద్ పోలీసులు గతంలో అయూబ్‌‌తోపాటు సల్మాన్ ఖాన్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఆటోడ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌కు ఫ్రీగా పెట్రోల్..అయూబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలను పరిశీలిస్తే.. గత రెండు రోజులుగా ఆయన ఉచితంగా పెట్రోల్ అందిస్తున్నారని అర్థమవుతోంది. ‘‘పెట్రోల్ బంకుల వద్ద భారీ సంఖ్యలో జనం ఉంటున్నారు.. చాలా మంది పెట్రోల్ విషయంలో ఆందోళన చెందుతున్నారు. దీంతో పెట్రోల్ కొట్టించుకోవడం చాలా కష్టంగా మారింది.. దీని వల్ల డెలివరీ బాయ్స్ లాంటి వారిపై ప్రభావం పడుతోంది.. అందుకే మేము ఫ్రీ పెట్రోల్ డ్రైవ్ మొదలుపెట్టాం. రెండు రోజులుగా మేము ఇలా చేస్తున్నాం. రాత్రి సమయాల్లో బంకులు మూతపడుతున్నాయి. 3-4 రోజుల్లో విక్రయించే పెట్రోల్‌‌ను 3-4 గంటల్లోనే విక్రయిస్తున్నామని.. అందుకే మేం బంకులు మూసేస్తున్నామని పెట్రోల్ బంక్ యాజమానులు చెబుతున్నార’’ని మని సయద్ అయుబ్ వెల్లడించారు.