కేంద్రం గుడ్‌న్యూస్.. పెట్రోల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు.. డీజిల్‌పై పూర్తిగా ఎత్తివేత!

Wait 5 sec.

Petrol Diesel Prices Today: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్‌పై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పెట్రోల్‌పై ఇక్కడ లీటరుకు రూ. 13 నుంచి రూ. 3 కు తగ్గిస్తున్నట్లు ప్రకటించగా.. డీజిల్‌పై గతంలో లీటరుపై రూ. 10 గా ఉండగా.. ఇప్పుడు దీనిని పూర్తిగా ఎత్తివేసింది. ఈ మేరకు రాయిటర్స్ సహా పలు ఆంగ్ల మీడియాల్లో దీని గురించి రిపోర్ట్స్ వస్తున్నాయి. ప్రభుత్వ వర్గాల నుంచి మాత్రం అధికారిక ప్రకటన రాలేదు. ఇక్కడ అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్దం నడుస్తున్నప్పటికీ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఉద్రిక్తతల నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడగా.. ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. క్రూడాయిల్ ధర కూడా బ్యారెల్‌కు.. యుద్ధానికి ముందు 70 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఇప్పుడు అది 106 డాలర్ల స్థాయిలో ఉంది. దీనికి అనుగుణంగా దేశీయంగా ధరలు పెరగాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కేంద్రం.. అదనంగా ఇంకా పెట్రోల్, డీజిల్‌పై సుంకాల్ని తగ్గించడం గమనార్హం.కిందటి రోజే దేశీయంగా ప్రైవేట్ రంగంలో అతిపెద్ద ఫ్యూయెల్ రిటైలర్‌గా ఉన్నటువంటి రష్యా కంపెనీ రాస్‌నెఫ్ట్‌కు చెందిన నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచింది. . అంతకుముందు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు.. ప్రీమియం పెట్రోల్ ధరల్ని పెంచేశాయి. ఇండస్ట్రియల్ డీజిల్ ధరల్ని కూడా పెంచాయి. ఇప్పుడు మాత్రం కేంద్రం.. సుంకాల్ని తగ్గించి శ్రీరామనవమి పండగ వేళ కాస్త ఊరట కలిగించింది.పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పుడు సాధారణంగా రిటైల్ పెట్రోల్ ధర తగ్గుతుంటుంది. ఈ ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వమే విధిస్తుంటుంది. కాబట్టి.. ఇందులో కోత విధిస్తే ఆ ప్రయోజనం వినియోగదారులకు అందుతుందని చెప్పొచ్చు. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకాలకు అదనంగా.. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ విధిస్తుంటాయి. కేంద్రం ఈ సుంకాలు తగ్గించినప్పుడు.. రాష్ట్రాలు కూడా సాధారణంగా VAT తగ్గిస్తుంటాయి. ఈ క్రమంలో రాష్ట్రాలు తగ్గిస్తే.. ధరలు ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.46 గా ఉండగా.. డీజిల్ ధర లీటర్ రూ. 95.70 పలుకుతోంది. ఇక ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్‌లోనే ధరలు ఎక్కువగా ఉన్నాయి.