Stock Market News: ప్రముఖ టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రమోటర్ సంస్థ, పేరెంట్ కంపెనీ టీవీఎస్ హోల్డింగ్స్ బుధవారం రోజు కీలక ప్రకటన చేసింది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 86 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ.. ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వివరాల్ని వెల్లడించింది. మార్చి 25న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో టీవీఎస్ హోల్డింగ్స్ డివిడెండ్ ప్రకటన చేసింది. ఇక్కడ డివిడెండ్ పొందేందుకు రికార్డు తేదీ ఏప్రిల్ 2 గా ఉంది. అంటే.. ఇంకో వారం వరకు ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. అంటే ఆలోపు ఈ కంపెనీ షేర్లు కలిగి ఉన్న వారికి డివిడెండ్ అందుతుందన్నమాట. >> ఇక కంపెనీ డివిడెండ్ ప్రకటన చేసినప్పటి నుంచి నెల రోజుల్లో డివిడెండ్ డబ్బులు అకౌంట్లో పడతాయని కంపెనీ స్పష్టం చేసింది. గతేడాది కూడా ఈ కంపెనీ మార్చి నెలలో షేర్ హోల్డర్లకు మధ్యంతర డివిడెండ్ రూ. 93 చెల్లించింది. దానికి ముందు 2024 ఏప్రిల్ నెలలో రూ. 94 డివిడెండ్ ఇచ్చింది. ఇదే సమయంలో కంపెనీ మరో ప్రకటన కూడా చేసింది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (NCDs) జారీ ద్వారా రూ. 650 కోట్ల మేర నిధుల్ని సమీకరించనున్నట్లు పేర్కొంది. టీవీఎస్ హోల్డింగ్స్ కంపెనీ విషయానికి వస్తే ఇది ఇండియన్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ కంపెనీ. ఇది టీవీఎస్ గ్రూప్‌లో భాగమే. సంస్థ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. టీవీఎస్ హోల్డింగ్స్ స్టాక్ ధర మార్చి 25న 2.80 శాతం మేర పెరిగి రూ. 14,108 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 27.77 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 16,297 కాగా.. కనిష్ఠ ధర రూ. 7904.70 గా ఉంది. నెల రోజుల్లో ఈ స్టాక్ 10 శాతం వరకు పడిపోగా.. 6 నెలల్లో 10 శాతం పెరిగింది. ఏడాదిలో మాత్రం 59 శాతం పుంజుకుంది. ఐదేళ్లలో 160 శాతం పెరిగింది. ఈ కంపెనీ మూడో త్రైమాసికం ఫలితాల విషయానికి వస్తే నికర లాభం వార్షిక ప్రాతిపదికన 27.7 శాతం పెరిగి రూ. 493.16 కోట్లుగా ఉంది. అంతకుముందు ఇదే సమయంలో లాభం రూ. 386.04 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ఆదాయం 34.5 శాతం పెరిగి రూ. 15,275.63 కోట్లుగా ఉంది. మొత్తం వ్యయాలు చూస్తే 33.8 శాతం మేర పెరిగి రూ. 13,824.10 కోట్లుగా ఉంది. Disclaimer: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పెట్టుబడికి సిఫార్సు కాదు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.