హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ చెందుతోంది. నగరంలో ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలకు చెందిన వారు కూడా నగరంలో ఉపాధి పొందుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ మహానగరం మరోసారి తన సత్తా చాటింది. దేశంలోని మెట్రో నగరాలన్నింటిని వెనక్కి నెట్టి 'నివసించడానికి అత్యంత అనుకూలమైన నగరం'గా అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ సంస్థ అన్‌బాక్సింగ్‌ బీఎల్‌ఆర్‌ తాజాగా విడుదల చేసిన 'WeAreCity 2026' నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.దేశంలోని ఎనిమిది ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే.. చాటింది. పటిష్టమైన రియల్ ఎస్టేట్ మార్కెట్, సామాన్యుడికి అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఇలా పలు ప్రత్యేకతలు హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఒకప్పుడు బెంగళూరు మాత్రమే ఐటీ రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది, కానీ ఇప్పుడు బెంగళూరు ఆధిపత్యానికి హైదరాబాద్ సవాల్ విసురుతోంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ఉద్యోగ కల్పనలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నివేదిక ప్రకారం.. హైదరాబాద్, బెంగళూరు నగరాలు కలిసి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. జనాభా పరంగా ముంబై, ఢిల్లీ ఎంతో పెద్దవైనప్పటికీ.. ఆర్థిక వృద్ధిలో మాత్రం ఈ రెండు నగరాలు వాటిని మించిపోతున్నాయి. పదేళ్ల క్రితం దేశంలోని టాప్-8 నగరాల్లో కొత్త కంపెనీల ఏర్పాటులో ఈ రెండు నగరాల వాటా 15 శాతం ఉండగా.. గత ఆర్థిక సంవత్సరం నాటికి అది 25 శాతానికి పెరిగింది. కార్యాలయాల విస్తరణ, గృహ రుణాల మంజూరు, విమాన ప్రయాణాలు, విద్యార్థుల చదువు వంటి అంశాల్లో ఈ రెండు నగరాలు అగ్రగామిగా ఉన్నాయి.రంగారెడ్డి జిల్లా దేశంలోని అత్యంత ధనిక జిల్లాల్లో ఒకటిగా నిలిచింది. ఆఫీస్ స్పేస్ అద్దె విషయానికి వస్తే.. బెంగళూరుకు హైదరాబాద్ కేవలం 15 శాతం దూరంలోనే ఉంది. కొత్త కంపెనీల ఏర్పాటులో బెంగళూరుతో హైదరాబాద్ సమంగా నిలవడం విశేషం. అయితే ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లు, సోషల్ ఈవెంట్స్, వినోదంపై పెట్టే ఖర్చుల విషయంలో బెంగళూరు నగరవాసులు ముందుండగా.. హైదరాబాద్ ప్రజలు గృహ నిర్మాణం వంటి సంప్రదాయ పెట్టుబడులకే ప్రాధాన్యత ఇస్తున్నారు.అభివృద్ధి ఎంత ఉన్నా.. రవాణా విషయంలో రెండు నగరాలు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని ఆ రిపోర్టు వెల్లడించింది. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ విపరీతంగా ఉంది. హైదరాబాద్‌లోనూ ఐటీ కారిడార్లలో ఆఫీసులకు వెళ్లే వారు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారు. బెంగళూరు కంటే హైదరాబాద్‌లో వాహనాల వేగం 20 శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రయాణ సమయం మాత్రం దాదాపు సమానంగా ఉండటం గమనార్హం. ఈ రిపోర్టు ప్రకారం.. మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాల మెరుగుదలతో హైదరాబాద్ ఇప్పుడు దేశానికే తలమానికంగా, బెస్ట్ సిటీగా నిలిచింది.