ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజుల పాటూ రాష్ట్రంలో అక్కడక్కడా పిడుగులతో కూడిన వానలు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇవాళ ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు.. కోస్తాంధ్రలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు.. రాయలసీమలోని కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇక మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రైతులు వ్యవసాయ పనుల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిడుగులు పడే ప్రమాదం ఉంది కాబట్టి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలు, పిడుగులు పడే సమయంలో చెట్ల క్రింద, పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు పిడుగులు పడే సూచనలు కనిపిస్తే ఇంట్లోనే ఉండాలని.. అయితే విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించడం ఆపాలని, డిస్‌కనెక్ట్ చేయాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఎత్తైన నిర్మాణాలు, చెట్ల కింద ఉండకూడదన్నారు.రైతులు వర్షాలు పడే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ఎవరైనా అన్నదాతలు వరి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటల్ని బయట ఆరబెట్టుకుని ఉంటే.. వాటిపై సురక్షితంగా ఏదైనా పట్టను కప్పేయడం మంచిదంటున్నారు. రైతులు, కూలీలు బహిరంగంగా పొలాల్లో పనిచేస్తుంటే జాగ్రత్తగా ఉండాలని.. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. మరో మూడు రోజుల పాటూ వానలు పడే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి నెల మొదటి 10 రోజులు ఎండల తీవ్రత కనిపించింది.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ఆ తర్వాత నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి.