మెుయినాబాద్ ఫాంహౌస్‌ కేసు.. ఏడాది కాలంగా రోహిత్‌ రెడ్డికి డ్రగ్స్‌.. తెరపైకి కొత్త పేర్లు, లింకులు

Wait 5 sec.

రంగారెడ్డి జిల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాండూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్ రెడ్డితో పాటు ఏపీకి చెందిన ఉండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈనెల 14న రోహిత్ రెడ్డి తన ఫాంహౌస్‌లో ఇచ్చిన డ్రగ్ పార్టీలో మెుత్తం 11 మంది పాల్గొనగా.. రోహిత్ రెడ్డి, పుట్టా మహేష్‌తో పాటు మరో నలుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది. ఆ సమయంలో పోలీసులపై కాల్పులకు పాల్పడటం కలకలం రేపింది. దీంతో రేవంత్ సర్కార్ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకొని వేగవంతమైన దర్యాప్తు కోసం ప్రత్యేకంగా సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా సిట్ విచారణలో కొత్త పేర్లు, లింకులు బయటపడుతున్నాయి. హైదరాబాద్‌ నగరానికే చెందిన డ్రగ్స్‌ పెడ్లర్‌ రాకేష్ వర్మ, అతని అసిస్టెంట్ అభిషేక్‌సింగ్‌తోపాటు రాజస్థాన్‌కు చెందిన మరో వ్యక్తి పాత్రను సిట్‌ అధికారులు గుర్తించారు. రాకేష్ వర్మ, రోహిత్‌ రెడ్డి, మరో నిందితుడు కౌశిక్‌ రవిల మధ్య ఏడాదికాలంగా డ్రగ్స్‌ కొనుగోలు జరిగినట్లు తెలిసింది. డ్రగ్స్‌ కోసం రోహిత్‌ రెడ్డి, కౌశిక్‌ రవి రాకేశ్‌వర్మను సంప్రదిస్తుంటారని, అతడు అభిషేక్‌సింగ్‌ లేదంటే మరొకరి ద్వారా డ్రగ్స్ సప్లయ్ చేసేవాడని గుర్తించారు. ఈ ముగ్గురూ ఈ నెల 15 నుంచే పరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిందితుల పేర్లు, అడ్రస్‌లు గుర్తించిన పోలీసులు... వారి కోసం వేర్వేరు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఈ కేసులో ఎంపీ పుట్టా మహేశ్‌ మినహా మిగిలిన ఏడుగురిని పోలీసులు గత సోమవారం నుంచి ఆదివారం వరకు విచారించారు. వారి విచారణలో ఈ కొత్త పేర్లు బయటపడినట్లు పోలీసులు తెలిపారు. ఇక తన కుమారుడు కనిపించటం లేదని అభిషేక్ సింగ్ తండ్రి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. పోలీస్ కస్టడీకి అనుమతి డ్రగ్స్ పార్టీ, పోలీసులపై కాల్పులు, హత్యాయత్నం కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న పైలట్‌ రోహిత్‌ రెడ్డి, అతని సోదరుడు రితేశ్‌ రెడ్డి, ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్‌శర్మల మూడు రోజుల పోలీసు కస్టడీకి ఉప్పర్‌పల్లిలోని న్యాయస్థానం అనుమతించింది. సోమవారం సాయంత్రం 4.30 గంటల నుంచి ఈనెల 26 సాయంత్రం 4.30 వరకు కస్టడీకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో రోహిత్‌రెడ్డి తరఫు న్యాయవాదులు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా అది విచారణకు రాలేదు. ప్రస్తుతం ఈ ముగ్గురు చంచల్‌గూడ జైలులో ఉండగా.. ఇవాళ ఉదయం పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశముంది. ఇప్పటికే నిందితుల ఫోన్లలోని డేటా, సాంకేతిక అంశాలతో పాటు మిగిలిన ఏడుగురు నిందితుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు సమాచారం సేకరించారు. ఆయా అంశాలపైనే కస్టడీలో ముగ్గురినీ సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు.