ఆకివీడులో రఘురామకృష్ణరాజుపై దాడి వెనుక కుట్ర!.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

Wait 5 sec.

కొంతమంది దాడికి యత్నించిన ఘటన మీద డిప్యూటీ సీఎం స్పందించారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే శ్రీరామ నవమి రోజు, ఆకివీడులో రామాలయానికి పూజలో పాల్గొనేందుకు వెళ్లిన డిప్యూటీ స్పీకర్ , ఆయన అనుచరులపైనా, జనసేన నాయకులపైనా కొంతమంది వ్యక్తులు ఆయుధాలతో దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పండుగ రోజు, ఆలయం దగ్గర ఈ దాడి జరగడం వెనుక కుట్ర కోణం ఉన్నట్లుగా అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి, దాడి వెనుక ఎవరున్నారో విచారణ జరిపి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానంటూ డిప్యూటీ సీఎంవో కార్యాలయ వర్గాలు ట్వీట్ చేశాయి.మరోవైపు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆకివీడు మండలం పెద్దపేట పర్యటనలో ఉద్రిక్తత తలెత్తింది. శ్రీరామనవమి సందర్భంగా పెద్దపేటలోని శిథిలావస్థకు చేరుకున్న రాముడి గుడిలో.. పూజలు నిర్వహించేందుకు రఘురామకృష్ణరాజ శుక్రవారం వెళ్లారు. అయితే రఘురామకృష్ణరాజు రాకను వ్యతిరేకిస్తూ.. పెద్దపేటలో దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. శిథిలమైన రామాలయం స్థానంలో కొత్త గుడిని నిర్మిస్తామని రఘురామకృష్ణరాజు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ రామాలయం వద్దని.. గొంతెనమ్మ ఆలయం నిర్మించాలని స్థానికంగా ఉన్న దళిత సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు రాకను దళిత సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే పెద్దపేట రామాలయంలో శుక్రవారం పూజకు వచ్చిన రఘురామకృష్ణరాజును కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీస్ బందోబస్తు మధ్య.. ఆయన రామాలయంలోకి వెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే రఘురామకృష్ణరాజు వెళ్లిన కాసేపటికే రామాలయం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న దళిత సంఘాలు.. రామాలయం నిర్మాణం కోరుతున్న వారి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలోనే రాళ్లదాడులు చేసుకున్నారు. దీంతో పలువురు గాయపడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే కత్తులు, మేకులు, రాళ్లు, చాకులతో దాడి చేశారని రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.