తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినీ నటి, టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ వ్యవస్థాపకురాలు ప్రసన్న.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు.. టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ సహకారం అందించేందుకు ఉన్న అవకాశాలపై చర్చలు జరిపారు. మంచు లక్ష్మీ వెంట.. దేవేంద్ర విద్యాలయ డైరెక్టర్ విజయేందర్ గౌడ్‌ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అయిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌తో సంయుక్తంగా పనిచేసే అవకాశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి.రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్థాపించనున్న సమగ్ర రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా.. విద్యార్థులకు సమానమైన, నాణ్యమైన విద్యను అందించే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యంతో టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ లక్ష్యాలను అనుసంధానించే అంశంపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సమగ్ర విద్యా వాతావరణాన్ని సృష్టించడమే యంగ్ ఇండియా కార్యక్రమం ద్వారా రేవంత్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ చేస్తున్న సేవలను సీఎం రేవంత్ రెడ్డికి మంచు లక్ష్మీ వివరించారు. మరీ ముఖ్యంగా పఠనాభివృద్ధి కార్యక్రమాలు.. డిజిటల్ లెర్నింగ్, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, టీచర్ల సామర్థ్యాల పెంపు వంటి అంశాలకు సంబంధించి టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ చేస్తున్న కృషిని తెలిపారు. సమగ్ర పాఠశాల మోడల్‌కు విధాన పరమైన సూచనలు.. ప్రణాళిక తయారీ, అమలు దశల్లో సహకరించేందుకు టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ రెడీగా ఉందని ఆమె సీఎంకు వివరించారు.ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఆధునిక సదుపాయాలు, అత్యాధునిక ల్యాబ్‌లు, సమగ్ర రెసిడెన్షియల్ వసతులతో వరల్డ్ క్లాస్ విద్యాసంస్థలను స్థాపించాలనే తన ఆకాంక్షను సీఎం రేవంత్ రెడ్డి వారి ముందు ఉంచారు. ఈ యంగ్ ఇండియా కార్యక్రమం ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అభివృద్ధి చేస్తూ విద్యా వ్యవస్థలో ఉన్న అసమానతలను తగ్గించడం, సామాజిక సమైక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. టీచ్ ఫర్ చేంజ్ సంస్థ డెవలప్ చేసిన కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను యంగ్ ఇండియా కార్యక్రమంలో అమలు చేసే అవకాశాలపైనా చర్చ జరిగింది. మరీ ముఖ్యంగా డిజిటల్ క్లాస్‌రూమ్స్, వాలంటీర్ ఎంగేజ్‌మెంట్, టీచర్ల ట్రైనింగ్ వంటి అంశాల్లో భాగస్వామ్యం గురించి చర్చించారు. విద్యా రంగంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతీ చిన్నారికి సమాన విద్యా అవకాశాలను కల్పించి.. వారు అభివృద్ధి చెందేందుకు తోడ్పడాలనే సంయుక్త లక్ష్యానికి ఇది నాంది అని పేర్కొంటున్నారు.