మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం.. నదిలో 100 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం, 28న సీఎం శంకుస్థాపన

Wait 5 sec.

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. లండన్‌ థేమ్స్ నది తరహాలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 1500 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ నిర్మించి 150 మీటర్ల ఎత్తున్న మహాత్మా గాంధీ విగ్రహం, మ్యూజియం, ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజాగా మత సామరస్యానికి ప్రతీకగా పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం నిర్మించాలని డిసైడ్ అయ్యారు. గండిపేట మండలం మంచిరేవుల గ్రామ పరిధిలో 800 సంవత్సరాల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం, 1400 ఏళ్ల నాటి మచిలేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయాలకు సమీపంలోనే కొత్తగా ఓంకారేశ్వర మందిరాన్ని నిర్మించేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనలతో ఆలయ నిర్మాణ శైలి ఇప్పటికే ఖరారైంది. ఈ పనులకు వీరభద్రస్వామి దేవాలయ ప్రాంగణంలో ఈనెల 28న సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మూసీ నదీ తీరంలో నాలుగు మతాలకు సంబంధించిన ప్రార్థనాలయాలను నిర్మించి.. అభివృద్ధి పనులను మత సామరస్యానికి ప్రతీకగా నిలపాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మంచిరేవులలోని పురాతన వీరభద్రస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయటంతో పాటు.. పురానాపూల్‌ వద్ద భారీమసీదు, గౌలిగూడ వద్ద గురుద్వారా, నాగోల్‌లో చర్చి నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జంట జలాశయాల నుంచి బాపూఘాట్‌ వరకు త్వరలో చేపట్టనున్న మూసీ తొలిదశ అభివృద్ధి పనులను ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శంకుస్థాపనతో ప్రారంభించబోతున్నారు. ఆలయంలో ఎత్తయిన గాలి గోపురం.. అందులో నుంచి లోపలికి వెళ్తే వేర్వేరు మండపాలు ఉండనున్నాయి. గర్భాలయ గోపురాన్ని 14 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు.. 64 అడుగుల ఎత్తుతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.700 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తుండగా.. దాతలు, ప్రైవేటు సంస్థలను భాగస్వాములను చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ దేవాలయానికి ఓఆర్‌ఆర్‌ నుంచి విశాలమైన రోడ్డు మార్గాలను నిర్మించనున్నారు. ఆలయం వద్ద విశాలమైన వెకిహల్ పార్కింగ్ ఏరియా, దిగువనున్న మూసీపై చిన్నపాటి ఆనకట్టను నిర్మించి నీటిని నిల్వ చేయనున్నారు. అక్కడే నది మధ్యలో నిల్చున్న భంగిమలో 100 అడుగుల శివుని విగ్రహం ఏర్పాటవుతుందని అధికారులు చెబుతున్నారు. విగ్రహం చుట్టూ పార్కులను అభివృద్ధి చేసి, బోటింగ్, ఇతర సౌకర్యాలను కల్పిస్తామని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.