ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు, నగర పంచాయతీల్లో కొత్త డివిజన్లు, వార్డులు పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా డివిజన్లు, వార్డుల్ని పునర్విభజన చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో గ్రేడ్ల ఆధారంగా డివిజన్లు, వార్డుల్ని నిర్ణయించగా.. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన వర్గీకరించనున్నారు. డివిజన్లు, వార్డుల సంఖ్యను 2011 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించారు కాబట్టి తదుపరి జనగణన ఫలితాలు వెలువడేవరకూ మార్చకూడదు. అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు, నగర పంచాయతీల్లో పాలకవర్గాలు ఉన్నచోట పదవీకాలం ముగిసిన తర్వాతే కొత్తగా పెరిగిన డివిజన్లు, వార్డులు అమలులోకి వస్తాయి. ఏపీ ప్రభుత్వం MS 64, 65 రెండు జీవోలను విడుదల చేసిందిఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా డివిజన్లు, వార్డులు 927 వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 3,916 డివిజన్లు, వార్డులు.. ఏకంగా 4,843కి పెరగనుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలోని పాలకవర్గాల పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా డివిజన్లు, వార్డుల పునర్విభజన పురపాలకశాఖ కమిషనర్‌ ప్రతిపాదనలు ఇవ్వగా.. ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జీవీఎంసీ (మహా విశాఖ నగర పాలక సంస్థ ) పరిధిలో వార్డుల సంఖ్య 98 నుంచి 120కి పెరగనుంది. అలాగే విజయవాడ కార్పొరేషన్‌లో ప్రస్తుతం 62 డివిజన్లు ఉండగా.. 14 స్థానాలు పెరిగి 76 డివిజన్లు కానున్నాయి. మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో జనాభాను బట్టి వార్డులు, డివిజన్ల సంఖ్య పెరగనుంది. డివిజన్లు, వార్డుల సంఖ్య పెరగనుండటంతో మరికొంతమంది ఎన్నికల్లో పోటీచేసేందుకు అవకాశం దక్కుతుంది అంటున్నారు. ఇటు కేంద్రం కూడా దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచాలని నిర్ణయానికి వచ్చింది. 2029 ఎన్నికల సమయానికి సీట్ల సంఖ్య పెరగడం ఖాయం అంటున్నారు. ఈ క్రమంలో ఏపీలో అసెంబ్లీ స్థానాల సంక్య 263కు పెరుగుతుంది అంటున్నారు. లోక్‌సభ స్థానాలు 38 వరకు పెరుగుతాయంటున్నారు.