ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరిక

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో ద్రోణి ప్రభావంతో వర్షాలు కొనసాగుతున్నాయి.. మరో మూడు రోజుల పాటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. నేడు అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు.. కోస్తాలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, పల్నాడు జిల్లాలు.. రాయలసీమలోని అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందంటున్నారు. అంతేకాదు కొన్ని జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్న జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. చెట్ల కింద నిలబడరాదని సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే సమయంలో.. రైతులు, కూలీలు పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. అలాగే పిడుగులు పడే సమయంలో.. ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులను వాడటం తగ్గించాలని సూచిస్తున్నారు. అలాగే రైతులు కూడా వ్యవసాయ పనుల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని.. బయట పంటల్ని ఆరబెట్టి ఉంటే వాటిని జాగ్రత్త చేసుకోవాలంటున్నారు.రానున్న రోజుల్లో క్రమంగా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందంటున్నారు. రాబోయే ఐదురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని అంచనాలు కూడా ఉన్నాయి. ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భావిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచే ఎండల తీవ్రత పెరిగింది. మార్చి నెల తొలి రెండు వారాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఇంతలోనే వాతావరణం మారిపోయింది.. అకాల వర్షాలు మొదలయ్యాయి.. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి. ఈ అకాల వర్షాలతో రైతులు నష్టపోయారు. ఏపీ ప్రభుత్వం పంట నష్టం అంచనాలను తయారు చేసే పనిలో ఉంది.