శ్రీనగర్- లేహ్ హైవేపై కూలిన మంచు చరియలు.. ఏడుగురు మృతి

Wait 5 sec.

జమ్మూ కశ్మీర్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. జోజిలా కనుమ వద్ద మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. శ్రీనగర్- లేహ్ నేషనల్ హైవేపై ఈ దుర్ఘటన జరిగింది. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనాలపై మంచు చరియలు విరిగిపడటంతో అవి కూరుకుపోయాయి. వాహనాల్లో చిక్కుకుని ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. ప్రమాదం కారణంగా శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్న బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ సిబ్బంది.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. భారీ ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన బీఆర్ఓ దళాలు.. మంచును తొలగించి ట్రాఫిక్ పునరుద్దరించే ప్రయత్నం చేస్తున్నారు. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ పరిస్థితిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ‘జోజిలా కనుమ వద్ద జరిగిన దురదృష్టకర సంఘటన గురించి వార్తలు విన్నాను.. కార్గిల్ కలెక్టర్, ఎస్పీలను అక్కడకు తక్షణమే వెళ్లి రెస్యూ ఆపరేషన్‌ను సమన్వయం చేసుకోవాలని ఆదేశించాను.. డిజాస్టర్ రిలీఫ్ ఫోర్సెస్, బోర్దర్ రోడ్డు ఆర్గనైజేషన్ సహా అన్ని ప్రభుత్వ సంస్థలను అప్రమత్తం చేశాను’ అని ఆయన లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ పేర్కొన్నారు.కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్‌ ( ట్విట్టర్)లో స్పందిస్తూ ఘటనలో ఏడుగురు చనిపోయినట్టు నిర్దారించారు.‘జోజిలా కనుమ వద్ద వాహనాలపై మంచు చరియలు విరిగిపడటంతో ఏడుగురు మరణించారు. ఇది చాలా విచారకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాం’ అని ఆయన తెలిపారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, పోలీసుల బృందాలు శిథిలాలను తొలగించడానికి, ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉంటే వారిని గుర్తించడానికి కృషి చేస్తున్నాయి.ఒకటో నెంబరు జాతీయ రహదారి (NH-1) శ్రీనగర్ లేహ్‌లను కలిపే ఒక కీలకమైన 434 కిలోమీటర్ల పొడవైన మార్గం. ఇది 11,575 అడుగుల ఎత్తులో ఉన్న జోజిలా కనుమ గుండా వెళ్తుంది. సుందరమైన దృశ్యాలు, ఎత్తైన ప్రదేశాలతో కూడిన ఈ మార్గంలో ప్రయాణం సవాళ్లతో కూడుకున్నది. భారీ హిమపాతం, ప్రమాదకరమైన భూభాగం కారణంగా, శీతాకాలంలో ఈ హైవే తరచూ మూసేస్తుంటారు.శీతాకాలంలో ఈ రహదారి మూసివేత సమస్యను పరిష్కరించేలా జోజిలా కనుమ మీదుగా ప్రస్తుతం ఒక ప్రధాన సొరంగం నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత, లడఖ్‌‌తో దేశంలోని మిగిలిన ప్రాంతాలకు మధ్య అన్ని కాలాల్లోనూ సురక్షితమైన అనుసంధానాన్ని అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో 14.2 కిలోమీటర్ల పొడవు, 9.5 మీటర్ల వెడల్పు గల ఒకే ట్యూబ్, రెండు లేన్‌ల సొరంగం సుమారు 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత, జోజిలా సొరంగం ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగంగా గుర్తింపు దక్కించుకోనుంది.