ఏపీవాసులకు అలర్ట్ .. ఈ 16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. నిన్నామొన్నటి వరకూ వరుణుడి దయతో ఉపశమనం పొందిన ప్రజలు.. ఇప్పుడు వానలు తగ్గిపోయి ఎండలు దంచికొడుతూ ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు కీలక సూచనలు చేసింది. శనివారం రాష్ట్రంలోని 16 మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. శనివారం రోజు (మార్చి 28) శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం, విజయనగరం జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గుర్ల, మెరకముడియం, రాజాం, రేగడిఆముదాలవలస, సంతకవిటి,తెర్లాం, వంగర మండలాలు.. పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, పాలకొండ, సాలూరు, సీతానగరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మరోవైపు రాయలసీమ జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. శనివారం రోజున 40 నుంచి 42 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్ధ అంచనా వేసింది. శనివారం రోజు రాష్ట్రవ్యాప్తంగా 68 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే ఆదివారం రోజున రాష్ట్రవ్యాప్తంగా18 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 29 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. చెవుల్లోకి వేడి గాలి వెళ్ళకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక శుక్రవారం రోజున (మార్చి 27) నంద్యాల జిల్లా గుల్లదుర్తిలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గుల్లదుర్తిలో 42.1 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత కడప జిల్లా కమలాపురంలో 42 డిగ్రీలు, పల్నాడు జిల్లా గురజాల, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 41.8 డిగ్రీలు, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 41.6 డిగ్రీలు, కర్నూలు జిల్లా తోవిలో 41.4 డిగ్రీల చొప్పున పగటి పూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో 41, ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో 40.4, మార్కాపురం జిల్లా బొట్లగూడూరు 40.2, అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లెలో 40.1, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో40 డిగ్రీల చొప్పున గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు డీహైడ్రేషన్‌కు గురికాకుండా మంచినీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలని సూచించింది.