‘చీరల కొట్టులో బేరమాడినట్టుంది’ ఎక్సైజ్ సుంకం తగ్గింపుపై మమతా బెనర్జీ విమర్శలు

Wait 5 sec.

పశ్చిమాసియాలో యుద్ధం వేళ.. పెట్రోల్‌‌పై రూ.13గా సుంకాన్ని రూ.3లకు, డీజిల్‌పై రూ.10లుగా ఉన్న సుంకాన్ని సున్నాకు తగ్గించింది. దీనిపై పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. చీరల కొట్టులో బేరమాడినట్టు ఉందని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘చీరల కొట్టుకు షాపింగ్‌కు వెళ్లినట్టు ఉంది.. మన ఒక చీర ఎంచుకుని దాని ధర ఎంతని అడిగితే దుకాణదారుడు రూ.1,000 చెబుతాడు.. బేరమాడితే చివరకు రూ.400 ఇవ్వడానికి ఒప్పుకుంటారు... అదే విధంగా, వాళ్లు గ్యాస్ ధరను పెంచారు. ఇప్పుడు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా కూడా, ఈ ధర పెరుగుదల ఎక్కడ ఆగుతుంది?’’ అని దీదీ విమర్శించారు. వంట గ్యాస్ సంక్షోభం కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేస్తూ.. హల్దియా నుంచి గ్యాస్ సిలిండర్లను బెంగాల్ వెలుపలికి పంపవద్దని ఆమె డిమాండ్ చేశారు. ‘‘ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకూడదనేదే నా ఆందోళన... మన ప్రాంతంలో గ్యాస్, పెట్రోల్ లభ్యత తగినంతగా ఉన్నప్పటికీ, పోలీసు అధికారుల నుంచి బీడీఓల వరకు మొత్తం పరిపాలనలో సమూల మార్పులు తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. బెంగాల్‌లోని హల్దియా నుంచి గ్యాస్ సిలిండర్లను రాష్ట్రం వెలుపలికి పంపవద్దని నేను డిమాండ్ చేస్తున్నాను’’ అని ఆమె అన్నారు.ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ పాలిత, ఎన్డీయే అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ తదితరులు ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న బలమైన నిబద్దతను ప్రతిబింబిస్తుందని ప్రశంసించారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అనేక దేశాలు ఇంధన ధరలు పెంచుతుంటే.. భారత్ మాత్రం ప్రజలకు మేలు జరిగేలా పెట్రోల్, డీజిల్‌పై సుంకాన్ని తగ్గించిందని అన్నారు. అయితే, ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేవలం రాజకీయ లబ్ది కోసమే ఎక్సైజ్ సుంకం తగ్గింపు డ్రామా ఆడుతోందని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆరోపించింది.1944 నాటి కేంద్ర ఎక్సైజ్ చట్టంలోని నిబంధనల మేరకు జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 3కి, డీజిల్‌పై సున్నాకు తగ్గించింది. అదనంగా, డీజిల్ ఎగుమతులపై లీటరుకు రూ. 21.5 విండ్‌ఫాల్ పన్ను విధించింది.