గడ్డి మందు కారణంగా కలుగుతున్న దుష్ప్రభావాలను .. పార్లమెంటులో ప్రస్తావించారు. పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందుపై పూర్తి నిషేధం విధించాలని .. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఎంపీ కడియం కావ్య.. ఈ గడ్డి మందు నిషేధంపై వ్యాఖ్యలు చేశారు. పారాక్వాట్ డైక్లోరైడ్ అనే రసాయన మందు రైతుల ప్రాణాలు తీయడమే కాకుండా.. ఆహార పదార్థాలను విషతుల్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఆ గడ్డి మందుపై పూర్తి నిషేధం విధించాలని తెలిపారు.ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు పర్యావరణానికి మాత్రమే కాకుండా.. మానవ ఆరోగ్యంపైనా పడుతున్న దుష్ప్రభావాలను వివరించారు. ఈ గడ్డి మందు కేవలం పొలాల్లో కలుపు మొక్కలను చంపేసే రసాయనం మాత్రమే కాదని.. భూమి, నీరు, గాలిని తీవ్రంగా కలుషితం చేస్తుందని స్పష్టం చేశారు. రైతులు.. తమ పంటల్లో పారాక్వాట్ డైక్లోరైడ్ రసాయనాన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల భూసారం దెబ్బతింటోందని తెలిపారు. అదే సమయంలో భూగర్భ జలాల్లోకి ఈ రసాయం చేసి.. నీళ్లు కూడా విషతుల్యం అవుతున్నాయని కడియం కావ్య లోక్‌సభ వేదికగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రసాయనం పరోక్షంగా ఆహారపు గొలుసులోకి చేరి జనాల ఆరోగ్యాలను నాశనం చేస్తోందని తెలిపారు. ఇక తన ప్రసంగంలో మరో కీలకమైన అంశాన్ని ఎంపీ కావ్య ప్రస్తావించారు. గ్రామాల్లో ఈ గడ్డి మందు రైతులు, సామాన్య ప్రజలకు ఆత్మహత్యలకు ప్రధాన సాధనంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న మనస్పర్థల కారణంగా.. క్షణికావేశంలో ఏదీ ఆలోచించకుండా ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ రసాయనాన్ని తీసుకున్న వారు ప్రాణాలు కోల్పోతున్నారని కడియం కావ్య పేర్కొన్నారు. పారాక్వాట్ డైక్లోరైడ్ తీసుకున్న ఘటనల్లో మరణాల రేటు దాదాపు 100 శాతం ఉండటం అత్యంత బాధాకరమైన విషయమని తెలిపారు. అయితే ఈ మందుకు ఇప్పటివరకు ఎలాంటి విరుగుడు లేకపోవడంతో సమయానికి ఆస్పత్రికి చేరినా.. బాధితుల ప్రాణాలు కాపాడలేకపోతున్నారని కడియం కావ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గం వరంగల్‌తోపాటు తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు వల్ల పోతున్న ప్రాణాలకు సంబంధించిన ఘటనలను ఎంపీ కావ్య తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), పలువురు వైద్య నిపుణులు కూడా ఈ గడ్డి మందు వల్ల కలిగే ముప్పును గుర్తించి.. నిషేధం విధించాలని ఇప్పటికే విజ్ఞప్తులు చేశారు. ప్రజల ప్రాణాలే కంటే ఏదీ ముఖ్యం కాదని.. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ తయారీ, విక్రయాలు, ఉపయోగించడంపై పూర్తి స్థఆయిలో నిషేధం విధించాలని ఎంపీ కావ్య డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రమాదకరమైన రసాయనాలకు బదులుగా పర్యావరణహితమైన.. సురక్షితమైన ప్రత్యామ్నాయాలను రైతులకు అందించాలని.. అందుకు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.