ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ కార్డు అవసరం లేదు.. మహిళలకు శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

Wait 5 sec.

తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కూడా సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళల ఉచిత బస్సు ప్రయాణ ఛార్జీల మొత్తం ఇవాళ్టితో రూ.10 వేల కోట్ల మార్కును చేరుకున్నట్లు అధికారులు వెల్లడించడం గమనార్హం. ఇక ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే అంటే.. 2023 డిసెంబర్ 9వ తేదీన ఈ ఉచిత బస్సు పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం.. ప్రస్తుత మార్చి 29వ తేదీ నాటికి 290 కోట్లకు పైగా జీరో టికెట్లను మహిళలకు జారీ చేశారని.. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10,000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.మరోవైపు.. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. గతంలో మహిళల ప్రయాణాలు 40 శాతంగా ఉండగా.. ఇప్పుడు అది 67 శాతానికిపైగా పెరిగినట్లు చెప్పాయి. నిత్యం సగటున 35 లక్షల మందికిపైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని గణాంకాలతో సహా వివరించారు. ఉద్యోగ, ఉపాధి, విద్య అవకాశాల కోసం రాష్ట్రంలోని మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. మరోవైపు.. గ్రామాల నుంచి నాణ్యమైన వైద్యం కోసం మహిళలలు ఆస్పత్రుల కోసం హైదరాబాద్ నగరానికి కూడా వస్తుండటం గమనార్హం. మరోవైపు.. కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రంలో ఉన్న పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతీసారి మహిళలు బస్సుల్లో ప్రయాణించేటపుడు ఉచిత ప్రయాణం కోసం.. ఆధార్ కార్డును పట్టుకుపోవడం అలవాటుగా మారింది. అయితే మహిళలకు మరింత సౌకర్యంగా ఉండేందుకు మహాలక్ష్మి పథకం కోసం త్వరలోనే చిప్ ఆధారిత స్మార్ట్ కార్డులను జారీ చేయనున్నట్లు తాజాగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. చిప్ ఆధారిత స్మార్ట్ కార్డులు అందుబాటులోకి వచ్చిన తర్వాత మహిళలు.. ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండా.. కేవలం స్మార్ట్‌ కార్డులు చూపించి ఉచితంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని చెబుతున్నారు. బస్సుల్లో పెరిగిన మహిళల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను ప్రవేశపెడుతున్నట్లు ఎండీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఇక జీరో టికెట్లను ఆర్టీసీ మహిళలకు జారీ చేస్తుండగా.. వాటికి సంబంధించిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ రూపంలో టీజీఎస్ఆర్టీసీకి చెల్లిస్తోంది. ఇలా చేయడం వల్ల కూడా ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుంది.