తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అసెంబ్లీ సాక్షిగా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆదివారం రోజున అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి వ్యవహరించిన తీరు సరైంది కాదని.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఇక కౌశిక్ రెడ్డి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎథిక్స్‌ కమిటీకి పంపించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎథిక్స్‌ కమిటీయే లేదని.. అసలు అసెంబ్లీ కమిటీలే లేవని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పాడి కౌశిక్‌ రెడ్డి అంశాన్ని లేని కమిటీకి పంపించడం ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన బండి సంజయ్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్‌ ఇద్దరూ ఒక్కటేనని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-రేసు కేసును సీఎం రేవంత్‌ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. , రేవంత్ రెడ్డి మధ్య ఈ వ్యవహారంలో అవగాహన కుదిరిందని విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారంలో బీజేపీపై తుపాకీ పెట్టి కాలుస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి అనుకుంటే తాము ఊరుకునే ప్రసక్తే లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు.మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పొత్తు ఎప్పటికీ జరగదని ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు తమ బీజేపీ పార్టీ ఎప్పటికీ దూరంగానే ఉంటుందని స్పష్టం చేశారు. వారసత్వ, కుటుంబ రాజకీయాలకు బీజేపీ ఎప్పటికీ వ్యతిరేకమని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి.. డిప్రెషన్‌లో ఉండి నియోజకవర్గాల పునర్విభజనపై మాటలు మాట్లాడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. మీద ఉన్న కసి కేటీఆర్‌ మీద సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు తగ్గిందని ఈ సందర్భంగా బండి సంజయ్ నిలదీశారు. ఈ విషయంలో హరీష్ రావు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. విడిపోయిన కేటీఆర్‌, కవితలను రేవంత్‌ రెడ్డి కలిపే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. అందు కోసం రహస్య ఒప్పందాలు జరిగాయని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్‌ సాక్షిగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ఉన్న రహస్య బంధం బయటపడిందని బండి సంజయ్‌ ఆరోపించారు.