ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక.. బీ అలర్ట్..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలలో కురుస్తాయని హెచ్చరించింది. వచ్చే మూడు గంటలలో ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, చిత్తూరు జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు మార్చి 29వ తేదీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో ప్రకటన విడుదల చేసింది. భారీ వర్షాలతో పాటుగా 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. మరోవైపు ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమలో వర్షాలు కురుస్తుంటే.. ఉత్తరాంధ్ర జిల్లాలలో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది. వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని అంచనా వేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు, ఎల్లుండి ( సోమ, మంగళవారం) రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే సోమవారం రోజున (మార్చి 30) విజయనగరం జిల్లాలోని బాడంగి, మెరకముడిదాం, తెర్లాం, వంగర.. పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, జియమ్మవలస, సీతానగరం మండలాలు.. అలాగే అల్లూరి జిల్లాలోని చింతూరు, కూనవరం మండలాలలో వడగాల్పుల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. మరోవైపు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 78 ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అత్యధికంగా నెల్లూరు జిల్లా గూడూరులో 42.4 డిగ్రీలు.. ఆ తర్వాత మార్కాపురం జిల్లా నందనమారెల్లలో 42.3 డిగ్రీలు.. కృష్ణా(జి) పెద్దపారుపూడి 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించింది. ఎండ వేడికి డీహైడ్రేషన్ కాకుండా నీరు తాగుతూ ఉండాలని.. వదులైన కాటన్ వస్త్రాలను ధరించాలని సూచించింది. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు. టోపీ వంటివి ధరించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.