పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార తృణముల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్ర మధ్య తీవ్ర మాటల యుద్ధం నెలకొంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మాంసాహారంపై నిషేధం విధిస్తారని.. ముఖ్యమంత్రి సహా టీఎంసీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఫిష్ పాలిటిక్స్ ఆ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే.. చేపలు, గుడ్లను తినకూడని పరిస్థితి తీసుకువస్తారని.. సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దీదీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ నేతలు.. చేపలను పట్టుకుని ఎన్నికల ప్రచారం చేస్తుండటం గమనార్హం. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ అధికారంలోకి వస్తే.. బెంగాల్‌లో చేపలు సహా మాంసం, గుడ్లపై నిషేధం విధిస్తారని.. సీఎం మమతా బెనర్జీ గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే దీదీ చేస్తున్న ప్రచారాన్ని దీటుగా బదులిచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న బీజేపీ నేతలు.. ప్రచారంలో ఏకంగా చేపలను తీసుకుని తిరుగుతుండటం గమనార్హం.ఢిల్లీ నుంచి వచ్చే నాయకులకు బెంగాల్‌ సంస్కృతి అర్థం కాదని మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మాంసాహారం తినడంపై ఆంక్షలు విధిస్తారని ఇటీవల చేస్తున్న ప్రచారంలో పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పురూలియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దీదీ.. ఇదే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేపలు తినరని.. బెంగాల్‌లో కూడా ఆ పార్టీ అధికారంలోకి వస్తే బెంగాల్ ప్రజలు కూడా మాంసం, గుడ్లు తినలేని పరిస్థితి వస్తుందని దీదీ ఆరోపించారు.ఇటీవలె బిహార్‌ ఉప ముఖ్యమంత్రి విజయ్‌ కుమార్‌ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లోని విద్యా సంస్థలు, సంతలు, ప్రధాన రహదారులు సహా బహిరంగ ప్రాంతాల్లో మాంసం, చేపల విక్రయాన్ని నిషేధించాలని ప్రకటించారు. బిహార్ ప్రజల వ్యక్తిగత ఆహార అలవాట్లను తాము గౌరవిస్తామని.. అయినప్పటికీ.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ బిహార్ విషయాన్నే దృష్టిలో పెట్టుకుని పదే పదే విమర్శలు చేస్తున్న మమతా బెనర్జీ.. బీజేపీ బెంగాల్‌లో అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా అవే ఆంక్షలే పెడుతుందని ఆరోపిస్తున్నారు.ఇక మమతా బెనర్జీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ నేతలు నానా తంటాలు పడుతున్నారు. రాష్ట్ర ప్రజల ఆహారపు అలవాట్లకు బీజేపీ వ్యతిరేకం కాదని పేర్కొంటూనే.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ నేతలు ఇస్తున్న ఇంటర్వ్యూలు.. నిర్వహిస్తున్న సభలు.. పోస్టర్ల ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిధాన్‌నగర్‌ బీజేపీ అభ్యర్థి శరద్వాత్‌ ముఖర్జీ.. ఏకంగా ఒక పెద్ద చేపను తీసుకువచ్చి.. ప్రచారం చేయడం గమనార్హం. చేపలు, మాంసం తాము కూడా తింటామని.. తమ పార్టీ బెంగాల్‌లో అధికారంలోకి వస్తే మాంసాహారంపై ఎలాంటి ఆంక్షలు విధించమని తేల్చి చెప్పారు. ఇక ఇదే విషయాన్ని స్పష్టం చేసిన బీజేపీ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు షామిక్‌ భట్టాచార్య కూడా స్పష్టం చేశారు. ఆహారపు అలవాట్లను బెంగాలీలు ఎప్పటికీ వదులుకోలేరని.. శాకాహారాన్ని ప్రోత్సహించే ఉద్దేశం బీజేపీకి లేదని తేల్చి చెప్పారు.