తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. రెవెన్యూ శాఖ మంత్రి కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ.. అధికార కాంగ్రెస్ పార్టీని, మరీ ముఖ్యంగా మంత్రి పొంగులేటి టార్గెట్‌గా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. రాఘవ కన్‌స్ట్రక్షన్ సంస్థపై అవినీతి, అక్రమాలపై హౌస్ కమిటీని వేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయగా.. ఇవాళ ఆ పార్టీ ఎమ్మెల్సీలను ఒకరోజు సస్పెండ్ చేశారు. తెలంగాణ శాసనమండలిలో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉదయం సభా కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్ వ్యవహారాన్ని లేవనెత్తారు. ఆ సంస్థపై హౌజ్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన ప్లకార్డులతో ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టారు. అయితే సభ్యులు శాంతించాలని పలుమార్లు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. విజ్ఞప్తి చేశారు. సభా సమయాన్ని వృథా చేయవద్దని సూచించారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గకపోవడంతో.. జోక్యం చేసుకున్న శాసనసభాపక్ష వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. సభ్యులు ఆందోళన విరమించాలని ఛైర్మన్ చెప్పినప్పటికీ.. వినకుండా సభా కార్యకలాపాలకు అడ్డుపడటం సరికాదని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటనను మంత్రి గుర్తు చేశారు.ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి జోక్యం చేసుకున్న మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వారిని సోమవారం ఒక రోజంతా సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత సభ్యులను సభ నుంచి మార్షల్స్ బయటికి పంపించేశారు. అనంతరం శాసనమండలి కొద్దిసేపు వాయిదా పడింది. సస్పెండ్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో మధుసూదనాచారి, రవీందర్‌రావు, దేశపతి శ్రీనివాస్‌, ఎల్‌. రమణ, యాదవరెడ్డి, సుంకరి రాజు, నవీన్‌ కుమార్‌రెడ్డి, మధుసూదన్‌, వాణీదేవి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎం.కోటిరెడ్డి ఉన్నారు. సభ నుంచి బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై వస్తున్న ఆరోపణల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పొంగులేటి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవికి పొంగులేటి రాజీనామా చేసేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సభలోనే కాకుండా బయట కూడా నిరసన కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. మరోవైపు.. ఆదివారం రోజున అసెంబ్లీలో బడ్జెట్‌పై జరుగుతున్న చర్చను అడ్డుకున్నారని.. 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈ సమావేశాలు పూర్తి అయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లడించారు. ఆదివారం ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ అక్రమంగా మైనింగ్‌ చేస్తోందని.. ఆ వ్యవహారంపై సభాసంఘం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, అనిల్‌ జాదవ్, కోవ లక్ష్మి, గూడెం మహిపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, పద్మారావు, చింతా ప్రభాకర్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, విజయుడులను సోమవారం సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.