Sukanya Samriddhi Account Scheme: మనకు పెట్టుబడులు పెట్టేందుకు ఎన్ని ఆప్షన్లు ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేసే స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. వీటినే పోస్టాఫీస్ స్కీమ్స్‌గా పిలుస్తుంటారు. ఇక్కడ వడ్డీ రేట్లు చాలా వరకు బ్యాంక్ ఎఫ్‌డీల కంటే అధికంగానే ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి రిస్క్ ఉండదు. నిర్దిష్ట వడ్డీ రేట్లను బట్టి.. నిర్ణీత కాల వ్యవధికి.. మీ పెట్టుబడుల్ని బట్టి రాబడి వస్తుంటుంది. అన్ని వర్గాల వారి కోసం ఇక్కడ పథకాలు ఉన్నాయి. వీటిల్లో , పీపీఎఫ్, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్‌కం స్కీమ్ ఇలా చాలానే ఉన్నాయి. కేంద్రం ప్రతి 3 నెలలకు ఓసారి (త్రైమాసికం చొప్పున) సమీక్ష నిర్వహించి వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంటుంది. ఇప్పుడు జనవరి- మార్చి త్రైమాసికం ముగుస్తుండగా.. ఏప్రిల్- జూన్ కోసం వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించాల్సి ఉంది. ఇక్కడ వడ్డీ రేట్లను కేంద్రం దాదాపు రెండేళ్లుగా మార్చకుండా స్థిరంగానే కొనసాగిస్తూ వస్తోంది. మార్చి 31న సమీక్ష జరగనున్నట్లు భావిస్తున్నారు. మరి ఈసారి వడ్డీ రేట్లు ఎలా ఉండనున్నాయో తెలియాలంటే కాస్త ఆగాల్సిందే. 2024, డిసెంబర్ 31 నుంచి ఈ వడ్డీ రేట్లను కేంద్రం మార్చట్లేదు. అప్పుడు సుకన్య సమృద్ధి సహా 3 ఇయర్ టైమ్ డిపాజిట్ వడ్డీ రేట్లను మాత్రమే పెంచింది. మరి ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో.. ద్రవ్యోల్బణం పెరుగుతుండగా.. రేట్లను పెంచడం కష్టమేనని భావిస్తున్నారు. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు ప్రస్తుతం 4 శాతంగా ఉంది. ఏడాది టెన్యూర్ టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.9 శాతంగా ఉండగా.. ఇక్కడ రూ. 10 వేలు డిపాజిట్ చేస్తే వార్షికంగా వడ్డీ రూ. 708 పొందొచ్చు. రెండేళ్ల టెన్యూర్ టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 7 శాతంగా ఉండగా.. రూ. 10 వేలపై ఏడాదికి రూ. 719 వడ్డీ వస్తుంది. మూడేళ్ల టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 7.10 శాతంగా ఉండగా.. ఇక్కడ 10 వేలు డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ. 729 వడ్డీ వస్తుంది. ఐదేళ్ల టెన్యూర్ టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 7.5 శాతంగా ఉండగా.. ఇక్కడ ఒకేసారి రూ. 10 వేలు జమ చేస్తే రూ. 771 వడ్డీ పొందొచ్చు. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ స్కీమ్ విషయానికి వస్తే వడ్డీ రేటు 6.70 శాతంగా ఉంది... రూ. 10 వేలు జమ చేస్తే ప్రతి 3 నెలలకు వడ్డీ రూపంలో రూ. 205 చొప్పున వస్తుంది. .. రూ. 10 వేలు డిపాజిట్ చేస్తే నెలకు రూ. 62 చొప్పున వడ్డీ అందుతుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు 7.7 శాతంగా ఉండగా.. రూ. 10 వేలు జమ చేస్తే మెచ్యూరిటీకి అంటే ఐదేళ్లకు మొత్తం విలువ రూ. 14,490 అవుతుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు 7.10 శాతంగా ఉండగా.. ఇక్కడ ఏటా రూ. 10 వేల చొప్పున 15 ఏళ్లు వరుసగా జమ చేస్తే మెచ్యూరిటీకి రూ. 2.71 లక్షలు వస్తాయి. సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు 8.20 శాతంగా ఉండగా.. ఇక్కడ కూడా ఏటా రూ. 10 వేలతో 15 ఏళ్లు కడితే మెచ్యూరిటికీ రూ. 4.61 లక్షలు వస్తాయి.