తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన గడువును రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి పొడిగించింది. దీంతో ఎన్నాళ్ల నుంచో జీతాలు పెరుగుతాయని ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి మొండిచేయిగా మారింది. ఈ నెలాఖరుతో పీఆర్సీ కమిటీ గడువు ముగియనుండగా.. మరో 6 నెలల పాటు పొడిగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మరో 6 నెలల పాటు పీఆర్సీ అమలు వాయిదా పడింది. ప్రస్తుత పీఆర్సీ కమిటీ గడువు ఈనెల 31వ తేదీతో ముగియనుంది. కొత్తగా పొడిగించిన గడువుతో సెప్టెంబర్ 30వ తేదీ వరకు పెరగనుంది. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా కొత్త పీఆర్‌సీ కోసం ఎదురు చూస్తునే ఉన్నారు. అయితే.. పీఆర్‌సీ కమిటీకి సంబంధించిన కొత్త నివేదిక ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వద్దకు చేరలేదు. ఈ నేపథ్యంలోనే పీఆర్సీ కమిటీ గడువు ఈనెల చివరితో ముగియనుండగా.. మరో 6 నెలలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పీఆర్‌సీ కమిటీ నివేదికను త్వరగా తెప్పించుకుని.. వేతనాలు సవరణ చేయాలని చాలా సార్లు ఉద్యోగ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం, వినతి పత్రాలు అందించడం చేశారు. అయినప్పటికీ కమిటీ రిపోర్టు సమర్పించకపోవడంతో అది వాయిదా పడుతూనే వస్తోంది.మరోవైపు.. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అసెంబ్లీలోనే ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే కొత్త పీఆర్సీని ప్రకటించి అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని.. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నళ్లు పూర్తి అవుతున్నా.. ఇప్పటికీ పీఆర్సీ ఇవ్వలేదని నిలదీశారు. మళ్లీ పీఆర్సీ కమిటీని పొడిగిస్తారా లేక ఇప్పుడైనా నివేదిక తీసుకుని ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఇస్తారా అని ప్రశ్నించింది. ఉద్యోగులకు ఎప్పటిలోగా పీఆర్సీ అమలు చేస్తారో స్పష్టంగా చెప్పాలని రెండు రోజుల క్రితమే అసెంబ్లీలో.. బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వం మరోసారి పీఆర్సీ కమిటీ పొడిగింపునకే మొగ్గు చూపడం గమనార్హం. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతనాల అమలు కావడం మరింత ఆలస్యం కానుంది. రోజురోజుకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణంతోపాటు.. జీవన వ్యయాల వల్ల ప్రస్తుతం తమకు వస్తున్న వేతనాలు సరిపోవడం లేదని ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.