ఏపీ పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ పెద్ద మనసు చాటుకున్నారు.. నెల్లూరులో కాపు, బీసీ భవనాలకు భారీ విరాళాలు అందజేశారు. మంత్రి నారాయణ తాజాగా నెల్లూరులో బీసీ భవన్‌ నిర్మాణానికి రూ.కోటి విరాళంగా అందజేశారు. మంత్రి నారాయణ అల్లుడు గంటా రవితేజ, ఎమ్మెల్సీ బీద రవిచంద్రలు బీసీ నేతలతో కలిసి కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి రూ.కోటి చెక్కు ఇచ్చారు. నెల్లూరు నేల మీద మరో మంచి పని జరిగిందంటే అది మంత్రి నారాయణ చొరవే అన్నారు రవితేజ. ఆయన సమాజంలో అన్ని వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఉంటారన్నారు. మంత్రి నారాయణ మాట తప్పని నాయకుడు అని మరోసారి నిరూపించారన్నారు రవితేజ. గతంలో కాపు భవనానికి 2 కోట్లు, షాదీ మంజిల్‌కు 50 లక్షలు ఇచ్చిన ఆయన.. ఇప్పుడు బీసీ భవన నిర్మాణానికి రూ.కోటి విరాళం అందించడం నిజంగా అభినందనీయం అన్నారు. మన సమాజంలో ప్రతి వర్గానికి ఆత్మగౌరవంతో నిలిచే భవనాలు ఉండాలని.. అదే మంత్రి నారాయణ లక్ష్యం అన్నారు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు కాదని.. ప్రతి వర్గం ఎదగాలి, గౌరవంగా జీవించాలన్నారు. అదే దిశగా మంత్రి నారాయణ గారు చేస్తున్న సేవలు అందరికీ ఆదర్శంగా నిలిచాయన్నారు. మరోవైపు మంత్రి నారాయణ మరో మాట కూడా నిలబెట్టుకున్నారు. అసంపూర్తిగా ఉన్న కాపు భవనాన్ని పూర్తి చేస్తానని.. తన పిల్లలు కోటి రూపాయలు, సీఎస్ఆర్ నిధుల ద్వారా మరో కోటి రూపాయలు ఇప్పిస్తానని గతంలో హామీ ఇచ్చారు. నెల్లూరులోని కాపు భవన్ ఆధునీకరణకు సంబంధించి మంత్రి గతంలో స్వయంగా రూూ.కోటి విరాళాన్ని అందించారు. అంతేకాదు మరో రూ.కోటి రూపాయల్ని కూడా ఇస్తానన్నారు. గతంలో చెప్పినట్లుగానే ఆయన తన హామీని నిబెట్టుకున్నారు. మంత్రి నారాయణ అల్లుడు పునీత్ నెల్లూరు కాపు భవన్ సభ్యుల సమక్షంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు రూ.కోటి విరాళం అందించారు. భారీ విరాళం ఇచ్చినందుకు మంత్రి నారాయణకు కాపు భవన్ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇలా మంత్రి నారాయణ సామాజిక సేవా కార్యక్రమాల్లో మంత్రి నారాయణ తన ఉదారతను చాటుకున్నారు.