CSK‌కి భారీ షాక్.. ఐపీఎల్ 2026కు ధోనీ దూరం, అఫీషియల్ స్టేట్‌మెంట్ రిలీజ్!

Wait 5 sec.

చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ధోనీ కోసమే ఐపీఎల్ మ్యాచ్‌లు చూసే ఎందరో అభిమానులకు ఇది చేదు వార్తే. ఐపీఎల్ 2026 మరికొద్ది గంటల్లో ప్రారంభం అవుతుందనగా.. చెన్నై సూపర్ కింగ్స్ అఫీషియల్ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. తొలి రెండు వారాల పాటు ఐపీఎల్‌కు దూరం కానున్నట్లు పేర్కొంది దాంతో ధోనీ స్థానంలో కీపింగ్ బాధ్యతలు సంజూ శాంసన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎంఎస్ ధోనీ కాలి కండరాల గాయంతో బాధపడుతున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రస్తుతం ధోనీ రిహాబిలిటేషన్‌లో ఉన్నాడని వెల్లడించింది. ఈ గాయం నుంచి కోలుకోవడానికి కనీసం రెండు వారాలు పట్టే అవకాశం ఉందని, దాంతో తొలి రెండు వారాలు ఐపీఎల్‌కు దూరం కానున్నట్లు పేర్కొంది. ఐపీఎల్ 2026లో సీఎస్కే తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్‌తో మార్చి 30న గువాహటిలో ఆడనుంది. ఈ మ్యాచ్‌తో పాటు తొలి రెండు వారాల్లో జరిగే కీలక మ్యాచ్‌లకు ధోనీ దూరం కానున్నాడు. ఈ రెండు వారాల్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. అందులో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లు చెన్నైలోనే జరగనుండటం గమనార్హం. 45 సంవత్సరాల ధోనీ ఐపీఎల్‌లో 278 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ధోనీ రికార్డు సృష్టించాడు. అయితే, గత కొంతకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న ధోనీ కేవలం అభిమానుల కోసమే ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. రిటైర్మెంట్ వార్తలు వినిపిస్తున్న సమయంలోనూ 2023లో కెప్టెన్‌గా ఛార్జ్ తీసుకుని సీఎస్కేకి ఐదో టైటిల్ అందించాడు. మొత్తానికి ఐపీఎల్ 2026 ప్రారంభంలో ధోనీ లేకపోవడం సీఎస్కేకి పెద్ద దెబ్బనే చెప్పొచ్చు. ప్రస్తుతం ధోనీతో పాటు సంజూ శాంసన్, కార్తిక్ శర్మ, ఉర్విల్ పటేల్ సీఎస్కే తరఫున వికెట్ కీపర్లుగా ఉన్నారు. సంజూ శాంసన్‌‌కు కీపింగ్ బాధ్యతలు అప్పగిస్తారా? లేక కార్తిక్ శర్మ, ఉర్విల్ పటేల్‌లో ఒకరికి అవకాశం కల్పిస్తారా అనేది వేచి చూడాలి.