రూ.5 బిస్కెట్ ప్యాకెట్‌ వేసినందుకు 130 కి.మీ వెంట నడిచిన శునకం.. కొండగట్టు యాత్రలో అద్భుతం..!

Wait 5 sec.

ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కుక్క మాత్రమే. ఆ మాట మరోసారి నిరూపితమైంది. మనం పెట్టే ఒక పూట అన్నం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టే గుణం శునకాల సొంతం. కృతజ్ఞత అనే పదాన్ని మనిషి మర్చిపోతున్న ఈ రోజుల్లో.. కేవలం ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్ అందించిన ప్రేమకు ప్రతిఫలంగా వందల కిలోమీటర్ల మేర నీడలా వెంటనడిచిన ఒక మూగజీవి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భక్తికి, విశ్వాసానికి నిలువెత్తు రూపంగా నిలిచిన ఆ శునకం మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరుకు చెందిన కొందరు హనుమాన్ దీక్షాపరులు తమ పాదయాత్రను ప్రారంభించిన సమయంలో ఈ అద్భుతం చోటుచేసుకుంది. యాత్ర మొదలైన కొద్దిదూరం తర్వాత వారికి ఒక శునకం తారసపడింది. ఆకలితో ఉన్న ఆ మూగజీవికి భక్తులు ఎంతో ప్రేమతో ఒక ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్‌ను ఆహారంగా వేశారు. ఆ చిన్న సాయం ఆ మూగజీవి మనసును గెలుచుకున్నట్లుంది. అప్పట్నుంచి ఆ భక్తులే తన సర్వస్వం అనుకుంది. వారు వెళ్లే దారి పొడవునా.. వారి అడుగులో అడుగు వేస్తూ కొండగట్టు అంజన్న క్షేత్రానికి బయల్దేరింది. ఇప్పటి వరకు సుమారు 130 కిలోమీటర్ల మేర ఆ కుక్క పాదయాత్ర చేసింది.ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. కఠినమైన తారు రోడ్ల మీద ఎండకు నడవడం వల్ల ఆ శునకం కాళ్లకు పొక్కులు వచ్చాయి. నడవలేని స్థితిలో ఉన్నా సరే.. ఆ భక్తులను విడిచిపెట్టడానికి అది ఇష్టపడలేదు. వారిని తన యజమానులుగా, ప్రాణప్రదంగా భావించి వెంట నడిచింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో అటవీ ప్రాంతం గుండా సుమారు 20 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వచ్చినప్పుడు.. ఆ శునకం ఒక 'జెడ్ ప్లస్' సెక్యూరిటీలా భక్తుల ముందు నడుస్తూ వారికి ధైర్యాన్ని నూరిపోసింది. క్రూర మృగాల భయం ఉన్నా.. భక్తులకు కొండంత అండగా నిలిచింది."గత ఐదురోజులుగా కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తున్నాం. ఈ శునకం మాకు హత్నూరులో తారసపడింది. అప్పట్నుంచి మాతో పాటే పాదయాత్ర చేస్తోంది. ఈ స్వామికి కాళ్లనొప్పి అయినా మాతోనే వస్తుంది.. మాతోనే ఉంటుంది. 130 కి.మీపైగా మాతోనే ప్రయాణించింది. ఒక బిస్కెట్ ప్యాకెట్ వేశాం. ఆ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ విశ్వాసంతో మాతో పాటే 130 కి.మీ నడిచింది. ఆ స్వామికి కాళ్లకు పొక్కులు వచ్చినా.. మాతోనే ఉంటుంది. ఒక జడ్ ఫ్లస్ సెక్యూరిటీ మాదిరి మాకు రక్షణ కల్పిస్తోంది. ఆ స్వామి విశ్వాసంతోనే మేం 20 కి.మీ మేర అడవిని రాత్రిలో పూర్తి చేశాం." అని భక్తుడు వెల్లడించారు. ఆ మూగజీవి చూపుతున్న విశ్వాసానికి భక్తులు కూడా ఫిదా అయ్యారు. దాని కాళ్ల నొప్పులను గమనించిన దీక్షాపరులు, సాటి మనిషికి చేసే సపర్యల కంటే మిన్నగా ఆ కుక్కను చూసుకున్నారు. దానికి కాళ్లకు సాక్సులు తొడిగి, ఎంతో ప్రేమగా ఆహారం అందిస్తూ తమతో పాటే తీసుకెళ్లారు. అది కేవలం ఒక జంతువులా కాకుండా.. ఆ హనుమంతుడి పంపిన దూతగా వారు గౌరవించారు. కొండగట్టు చేరే వరకు ఆ శునకం వారి వెంటే ఉండి, విశ్వాసానికి ఉన్న అసలైన నిర్వచనాన్ని చాటిచెప్పింది. ఈ మూగజీవి చూపిన విశ్వాసం నేటి సమాజానికి ఒక గొప్ప సందేశం. మనిషి స్వార్థంతో బంధాలను మర్చిపోతున్న తరుణంలో.. ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కోసం 130 కిలోమీటర్ల విశ్వాసాన్ని కురిపించిన ఆ శునకం అందరికీ ఆదర్శప్రాయం.