ఏపీలో దివ్యాంగులకు ముఖ్య గమనిక.. సదరం స్లాట్లు ప్రారంభం, బుక్ చేస్కోండి

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో సదరం స్లాట్ల బుకింగ్ ప్రారంభమైంది. నేటి నుంచి దివ్యాంగులకు వైకల్య నిర్ధారణకు సంబంధించిన సదరం సర్టిఫికెట్ కోసం స్లాట్‌ బుక్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో సదరం స్లాట్లు బుక్ చేసుకునే సేవలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు సదరం సర్టిఫికెట్లను డిజిటల్‌ విధానంలో జారీ చేయనున్నారు. దివ్యాంగులు సదరం స్లాట్‌ బుకింగ్‌ కోసం దగ్గరలోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలకు వెళ్లాలి. అక్కడ సిబ్బందిని సంప్రదించి, ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ ప్రక్రియ మొత్తం పూర్తిగా ఉచితం, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.దివ్యాంగులు సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి.. ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు ఫొటో, మొబైల్ నంబరు, వైకల్యం తెలిపే ఫొటోలు, ఒకవేళ పాత సదరం సర్టిఫికెట్ ఉంటే తీసుకెళ్లాలి. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో స్లాట్‌ బుక్‌ చేయగానే వైద్యపరీక్షలకు ఆస్పత్రితో పాటుగా డేట్ ఫిక్స్ అవుతుంది. ఆ స్లాట్ ప్రకారం ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.. ఈ నెల 30 నుంచి ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు ప్రారంభమవుతాయి. అనంతరం సదరం సర్టిఫికెట్ జారీ చేస్తారు. ప్రస్తుతం మొత్తం 13 రకాల వైకల్యం, వ్యాధులకు మాన్యువల్‌గా సదరం సర్టిఫికెట్లు ఇస్తున్నారు. వీటికి తోడు మరో ఆరు కేటగిరీలు కూడా కలిపి సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు.ఏపీ ప్రభుత్వం ఈ నెల 18న పేరుతో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించే పథకం ప్రారంభమైంది. రాష్ట్రానికి చెందిన 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు (మొత్తం 21 కేటగిరీల్లో) ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చు. ఈ క్రమంలో ఈ సదర సర్టిఫికెట్లకు ప్రాధాన్యత పెరిగిందని చెబుతున్నారు. దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ల కోసం స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్‌ను ఇకపై డిజిటల్ విధానంలో పారదర్శకంగా అందిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దివ్యాంగులు పింఛన్, ఉచిత బస్సుతో పాటుగా ప్రభుత్వ పథకాలు, రాయితీలు పొందాలంటే ఈ సదరం సర్టిఫికెట్ చాలా కీలకం. అయితే గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగులకు సంబంధించిన పింఛన్ల విషయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి . ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం వైద్య బృందాల సాయంతో పరీక్షలు నిర్వహించింది. ఈ క్రమంలో కొత్తగా సదరం సర్టిఫికెట్ల జారీని నిలిపివేశారు. గతేడాది మళ్లీ సదరం స్లాట్‌లను ప్రారంభించి సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సదరం స్లాట్ల బుకింగ్ ప్రక్రియ ప్రారంభించింది.